తెలంగాణ

Harish Rao: రైతులకు ఇచ్చింది 8గంటల కరెంటే.. ఇదిగో సాక్ష్యం- హరీశ్ రావు

రచన: NK•••12 నిమిషాల పఠనం

Harish Rao: రేవంత్ సర్కార్ పాలనలో రైతులకు 8 గంటల కరెంట్ కూడా దక్కడం లేదన్నారు మాజీమంత్రి హరీశ్ రావు. ఇచ్చిన 7 గంటల 50 నిమిషాల కరెంటులోనూ మూడుసార్లు కోతలే విధించారన్నారు. మాటల్లో 24 గంటల ఉచిత విద్యుత్.. చేతల్లో మాత్రం నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ట్రిప్పింగ్‌లతో పారిన మడే పారుతూ, వెనక మళ్లకు నీరందక పంటలన్నీ ఎండిపోతున్నాయని వాపోయారు.

Harish Rao: రేవంత్ సర్కార్ పాలనలో రైతులకు 8 గంటల కరెంట్ కూడా దక్కడం లేదన్నారు మాజీమంత్రి హరీశ్ రావు. ఇచ్చిన 7 గంటల 50 నిమిషాల కరెంటులోనూ మూడుసార్లు కోతలే విధించారన్నారు. మాటల్లో 24 గంటల ఉచిత విద్యుత్.. చేతల్లో మాత్రం నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ట్రిప్పింగ్‌లతో పారిన మడే పారుతూ, వెనక మళ్లకు నీరందక పంటలన్నీ ఎండిపోతున్నాయని వాపోయారు.

ఐటీ కంపెనీలకు, బడా పరిశ్రమలకు కడుపునిండా కరెంట్

ఐటీ కంపెనీలకు, బడా పరిశ్రమలకు కడుపునిండా కరెంట్ ఇచ్చి.. అంతా వాడగా మిగిలిన అడుగుబొడుగు లో వోల్టేజ్ కరెంటును రైతుల ముఖాన కొడుతున్నారని ఆరోపించారు. నాడు కేసీఆర్ రైతుకు మొదటి ప్రాధాన్యతనిచ్చి 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంట్ ఇస్తే.. నేడు రేవంత్ రెడ్డి పరిశ్రమల కోసం రైతుల పొట్టకొడుతూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు.

సబ్ స్టేషన్ లో లాగ్‌బుక్‌ పరిశీలన

గద్వాల నియోజకవర్గం గట్టు మండలంలో సాగునీరు, విద్యుత్ అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు హరీశ్ రావు. విద్యుత్ సరఫరా తీరును పరిశీలించేందుకు గట్టు మండల విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారాయన. సబ్‌స్టేషన్‌లోని అధికారిక లాగ్‌బుక్‌ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

7-8 గంటలే..

''గట్టు మండలంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని ఉదయం నుంచి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం 7-8 గంటల కరెంట్ కూడా రావడం లేదు. మధ్యమధ్యలో పదేపదే ట్రిప్ అవుతూ మోటార్లు నడవక పంటలు ఎండిపోతున్నాయని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు.

అరకొర విద్యుత్.. అందులోనూ కోతలు

రైతుల ఆవేదన వాస్తవమా కాదా అని స్వయంగా నిర్ధారించుకోవడానికే గట్టు సబ్‌స్టేషన్‌కు వచ్చి అధికారిక లాగ్‌బుక్‌ను స్వయంగా పరిశీలించాము. అక్టోబర్ 13 లాగ్‌బుక్ రికార్డుల ప్రకారం రైతులకు ఇచ్చిన త్రీ ఫేస్ కరెంట్ కేవలం 7 గంటల 50 నిమిషాలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం 8 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయింది. ఇచ్చిన 7 గంటల 50 నిమిషాల్లో కూడా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వలేదు. అందులోనూ మూడు సార్లు విద్యుత్ సరఫరాను బంద్ చేశారు. ఒకసారి గంట సేపు, మరోసారి ఐదు నిమిషాలు, ఇంకోసారి పది నిమిషాల పాటు కరెంట్ నిలిపివేశారు.

ఇచ్చిన అరకొర సమయంలోనే మూడు నాలుగు సార్లు కరెంట్ కోతలు పెట్టడం సిగ్గుచేటు. ఇలా పదేపదే విద్యుత్ ట్రిప్ అవ్వడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. బోరు ఆన్ చేసి నీళ్లు పారేలోపే కరెంట్ పోతోంది, మళ్లీ వచ్చినప్పుడు మొదట పారిన మడే పారుతోంది తప్ప వెనక మళ్లకు నీళ్లు అందడం లేదు. ఫలితంగా చివరి మళ్లకు చుక్క నీరు అందక పంటలన్నీ రైతుల కళ్లముందే నిలువునా ఎండిపోతున్నాయి.

ఉద్దేశపూర్వకంగానే రైతుల కరెంట్‌ కట్

కేసీఆర్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం 7 గంటల 50 నిమిషాల కరెంటు ఇచ్చి అందులోనూ గంటల కొద్దీ కోతలు విధిస్తూ అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోంది. లాగ్‌బుక్ ఆధారంగా సబ్‌స్టేషన్ ఆపరేటర్‌ను నిలదీస్తే చేదు నిజాలు బయటపడ్డాయి. మేం ఏం చేస్తాం సార్.. పైనుంచి బంద్ చేయమంటే బంద్ చేస్తాం, ఆన్ చేయమంటే ఆన్ చేస్తాం.. మా ఫోన్లకు అధికారుల నుంచి బంద్ చేయమని మెసేజ్‌లు వస్తాయి. మెసేజ్ రాగానే బంద్ చేస్తాం. మా చేతుల్లో ఏమీ లేదు.. పైనుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కరెంట్ ఇస్తే అంతే ఇస్తాం అని ఆపరేటర్ తన ఫోన్ చూపిస్తూ స్పష్టం చేశాడు. దీన్ని బట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతుల కరెంట్‌ను కట్ చేస్తోందని రుజువైంది'' అని హరీశ్ రావు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు

రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైదరాబాద్ ముఖ్యం, హైటెక్ సిటీ ముఖ్యం, బడా పరిశ్రమలు ముఖ్యం.. కానీ పల్లెల్లోని పేద రైతులు మాత్రం ముఖ్యం కాదన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందరూ వాడుకున్న తర్వాత కరెంట్ ఏమైనా మిగిలితే, ఆ మిగిలిన లో-వోల్టేజ్ కరెంటును గట్టు ప్రాంత రైతులకు ఇస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

నగరాలకు, ఐటీ కంపెనీలకు నిరంతర విద్యుత్

''ఒకవేళ హైదరాబాద్‌కో, పరిశ్రమలకో ఎక్కువ విద్యుత్ అవసరమైతే వెంటనే గట్టు సబ్‌స్టేషన్‌కు, ఇక్కడి రైతులకు కరెంట్ బంద్ చేస్తున్నారు. నగరాలకు, ఐటీ కంపెనీలకు నిరంతరాయంగా విద్యుత్ ఇచ్చి, రైతుల కరెంటుకు మాత్రం ఎసరు పెడుతున్నారు. కేసీఆర్ కి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న ప్రధాన తేడాను రైతాంగం స్పష్టంగా గమనించాలి. కేసీఆర్ రైతును దేశానికి వెన్నెముకగా భావించి, మొదట రైతులకు కడుపునిండా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఆ తర్వాత మిగిలిన విద్యుత్‌ను పరిశ్రమలకు, ఇతర అవసరాలకు సర్దుబాటు చేశారు. కానీ నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌కు, పరిశ్రమలకు కడుపునిండా కరెంట్ ఇచ్చి.. చివరకు మిగిలిన అడుగుబొడుగు లో వోల్టేజ్ విద్యుత్‌ను అన్నదాతల ముఖాన కొడుతోంది. ఈ మోసపూరిత విధానాన్ని రైతు సోదరులు గుర్తించి రేవంత్ సర్కార్‌కు తగిన గుణపాఠం చెప్పాలి'' అని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

దళితుల భూములు లాక్కుంటే ఊరుకోము

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం పేద దళిత రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూస్తున్న ప్రభుత్వ తీరుపై రైతులు చేస్తున్న పోరాటానికి హరీశ్ రావు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. గ్రామంలో తరతరాలుగా తాము సాగుచేసుకుంటున్న 110 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకోవాలని చూస్తోందని రాయపురం రైతులు హరీశ్ రావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్ రికార్డులు ఉండి, రైతుబంధు పడుతూ, పంట రుణాలు తీసుకుంటూ వరి, శనగ సాగు చేసుకుంటున్నామని.. తమకు ఈ భూములే జీవనాధారమని తెలిపారు. మొదట 50 ఎకరాలు అని చెప్పి, ఇప్పుడు మొత్తం 110 ఎకరాలనూ లాక్కుంటామని అధికారులు, ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారని, ఎంత డబ్బిచ్చినా తమ భూములను వదులుకోబోమని రైతులు స్పష్టం చేశారు.

రైతుల ఆవేదనను విన్న హరీశ్ రావు వారికి పూర్తి భరోసా ఇచ్చారు. పచ్చని పంటలు పండే పేద దళితుల భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని భూములను వదులుకోవద్దని సూచించారు. భూముల రక్షణ కోసం రైతులు చేసే ప్రతి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉంటుందని, ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజాక్షేత్రంలోనూ, అసెంబ్లీలోనూ నిలదీసి పేదల భూములను కాపాడుకుంటామని హరీశ్ రావు స్పష్టమైన హామీ ఇచ్చారు.

మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం..

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో హరీశ్ రావు కాన్వాయ్‌ను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆపి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ నాసిరకం పురుగుల అన్నం, ప్రతిరోజు వంకాయ కూర పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో చదువుకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, కనీస వసతులు కరువై ఇబ్బందులు పడుతున్నామని, దీనివల్ల స్కూల్ డ్రాపౌట్స్ పెరిగాయని వాపోయారు. అంతేకాకుండా, గ్రామంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల వల్ల చదువులు మధ్యలోనే మానేసి, తల్లిదండ్రులతో కలిసి కూలి పనుల కోసం వలస వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ఓపిగ్గా విన్న హరీశ్ రావు.. పాఠశాల దుస్థితిని, విద్యార్థుల ఆవేదనను స్వయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

#Harish Rao#Brs#Congress#Cm Revanth Reddy#Power Supply#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి