ఎల్నినో ప్రభావంతో సాగు, తాగునీటికి కష్టాలు అధికమవుతున్నాయి. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులతో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో సాగునీటి పంపిణీకి సంబంధించి రెండు గ్రామాల రైతుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా పాన్గల్ మండల పరిధిలో ప్రవహిస్తున్న భీమా కాలువ ద్వారా జూరాల ప్రాజెక్టు నీటిని మళ్లించే వ్యవహారంలో మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
పండిన పంటలను కాపాడుకునేందుకు నీటి కోసం సాగుతున్న ఈ పోరు క్షేత్రస్థాయిలో నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి భీమా కాలువకు వస్తున్న సాగునీటి పంపిణీపై ఈ రెండు గ్రామాల రైతుల మధ్య కొంతకాలంగా అభిప్రాయభేదాలు ఉన్నాయి. తమ పొలాలకు తగినంత నీరు అందడం లేదనే కోపంతో మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతులు కాలువ వద్ద ముఖాముఖి తలపడ్డారు.
మాటమాట పెరిగి పరస్పరం పిడిగుద్దులు గుద్దుకుంటూ భౌతిక దాడులకు దిగారు. కాలువ గేట్ల నిర్వహణ, నీటి మళ్లింపుపై ఇరువర్గాలు పట్టుబట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు పోలీసుల సమక్షంలోనే పరస్పర దాడులను కొనసాగించారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన పలువురు రైతులకు ఈ ఘర్షణలో స్వల్ప గాయాలయ్యాయి.
అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని నీటి పంపిణీ సమస్యను పరిష్కరించకపోతే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మరిన్ని జరిగే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘర్షణ పరిణామాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు, పోలీసులు స్పందిస్తూ సాగునీటి వినియోగంపై శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రెండు గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతు నాయకులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. అయితే నీటి విడుదల ఆలస్యం కావడం, అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ పరిస్థితి దాపురించిందని బాధితులు మండిపడుతున్నారు.


