రాష్ట్రంలో అవినీతి అనకొండలు కోరలు చాస్తున్నాయి. లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరం అని తెలిసినా కాసుల మత్తులో జోగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే అక్రమ సంపాదన కోసం కొందరు వెంపర్లాడుతున్నారు.ప్రతిరోజూ ఎవరో ఒకరు ఏసీబీకి పట్టుబడుతున్నా లంచం తీసుకునేవారిలో ఏమాత్రం భయం ఉండటం లేదు. ప్రజలు చైతన్య వంతులు కావడంతో లంచం డిమాండ్ చేసిన వారిని నేరుగా ఏసీబీకి పట్టిస్తున్నారు.
రాష్ట్రంలో ఏసీబీ అధికారుల వేట కొనసాగుతోంది.లంచం డిమాండ్ చేయడంతో పాటు తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టులు చేస్తున్నారు.వారి నుంచి అక్రమ సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లంచం తీసుకుంటూ దొరికిన వారి ఇల్లు, బినామీల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా,ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు. కరెంట్ మీటర్ కోసం లంచం డిమాండ్ చేసిన ఘటనలో అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
వివరాల్లోకివెళితే.. హైదరాబాద్‌లో కరెంట్ మీటర్ల మంజూరు కోసం రూ. 1,20,000 లంచం తీసుకుంటూ టీజీఎస్పీడీసీఎల్ (TGSPDCL) అసిస్టెంట్ ఇంజనీర్ పీఎస్ రాకేష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన మదన్నపేట సెక్షన్ సంతోష్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫిర్యాదు దారుడి భవనానికి కొత్తగా 6 విద్యుత్ మీటర్లను మంజూరు చేయడానికి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు.
దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం బాధిత వ్యక్తి అసిస్టెంట్ ఇంజినీర్ రాకేశ్‌కు రూ. రూ.1,20,000 లంచం రూపేణా అందజేస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రసాయన పరీక్షలు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, ఏఈ రాకేష్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టుకు తరలించారు.


