కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయడంతో పాటు అర్హుల ఓట్లు తొలగించిన సీఈసీ పదవి నుంచి తప్పుకోవాలని ఈ సందర్భంగా ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే,సుప్రీంకోర్టు ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించిన వ్యవహారంపై దేశ సర్వోన్నత నాయకత్వంపై తీవ్రంగా స్పందించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 'ఇండియా' కూటమికి చెందిన పలువురు ప్రముఖ నేతలకు సుప్రీం కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సుప్రీంకోర్టును ఎవరూ భయపెట్టలేరు. కోర్టు బయట ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో మాకు స్పష్టంగా తెలుసు’ అని సీజేఐ సీరియస్ అయినట్టు తెలిసింది.
సుప్రీంకోర్టు వరకు విపక్ష నేతలు చేపట్టిన ర్యాలీ, కోర్టు ప్రాంగణం వద్ద చోటుచేసుకున్న పరిణామాలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, ప్రాంగణ మర్యాదను కాపాడటంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదనీ ధర్మాసనం తేల్చి చెప్పింది. ర్యాలీ నిర్వహణకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాల మేరకు ఈ నోటీసులు ఇచ్చింది.
సుప్రీంకోర్టు వరకు ర్యాలీ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది. కోర్టు ప్రాంగణ నియమ నిబంధనలకు భంగం కలిగించేలా వ్యవహరించడంపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించినట్టు సమాచారం. కోర్టు నిర్ణయంపై విపక్ష కూటమి నేతలు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది. కాగా,జంతర్ మంతర్ వద్ద నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి సుప్రీంకోర్టు ప్రాంగణం వరకు సేవ్ డెమోక్రసీ పేరిట మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే.


