అభిప్రాయం

India Development: అభివృద్ధిలో ఇండియా ఎందుకు వెనకబడుతుంది?!

రచన: Venu•••14 నిమిషాల పఠనం

భారతదేశంలో కూడా సహజ వనరులు, అపారమైన మానవ వనరులు ఉన్న అదే స్థాయిలో ఎందుకు అభివృద్ధి చెందలేకపోతోంది? అసలు మన అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నది ఎవరు? సమస్య ఎక్కడ ఉంది?

ఇండియా.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందని అనిపిస్తుంది. మేరా భారత్ మహాన్ అని వేల గొంతుకల నుండి వెలువడే శబ్ధం జీవచ్చమైన దేహంలో కూడా జీవాన్ని నింపుతుంది. అదీగాక ఇక్కడి సంస్కృతి సంప్రదాయం ప్రపంచ దేశాలను విపరీతంగా ఆకట్టుకోవడం వల్ల కొందరు ఫారినర్స్ ఇండియాలో ఆథ్యాత్మికపరమైన జీవన విధానాన్ని అలవరచుకుని ఇక్కడే ఉండిపోయిన ఘటనలు ఉన్నాయి..

మరోవైపు ప్రపంచ చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు పుట్టాయి.. ఎన్నో రాజ్యాలు కనుమరుగయ్యాయి. కానీ కొన్ని నాగరికతలు అందించిన జ్ఞానం మాత్రం దేశాల సరిహద్దులు దాటి తరతరాలకు మార్గదర్శకంగా నిలిచింది. అలాగే భారతదేశం అందించిన జ్ఞానం కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాలేదు. ప్రాచీన భారతీయ గణితంలో అభివృద్ధి చెందిన సున్నా, దశాంశ స్థాన విలువ పద్ధతులు అరబిక్ ప్రపంచం మీదుగా యూరప్‌కు చేరి ఆధునిక గణిత వికాసానికి తోడ్పడ్డాయి.

ఆయుర్వేదం, యోగా వంటి భారతీయ సంప్రదాయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, జీవన విధానాలపై ప్రభావం చూపించాయి. మరోవైపు ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో నేడు భారత్ ఒకటిగా నిలిచింది. కానీ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవడంలో భారతదేశం నేటికీ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలో ఉన్న వనరులకు ఏం లోటు లేదు. అలాగే ప్రకృతి సంపద నుంచి ప్రపంచ స్థాయి ఆవిష్కరణల వరకు అన్నీ రంగాలలో వేగంగా దూసుకుపోతుంది. అయిన భారతదేశం ప్రపంచ దేశాలతో పోల్చితే అభివృద్ధిలో వెనుకబడుతూనే ఉంది. ఈ క్రమంలో అసలు సమస్య ఎక్కడుందనే ఆలోచనలు పుడుతున్నాయి.

ఇక ఇజ్రాయెల్‌కు నీటి కొరత.. జపాన్‌కు సహజ వనరుల కొరత.. సింగపూర్‌కు భూమి కొరత.. అయినప్పటికీ ఈ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. వారికి ఉన్న పరిమిత వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ సాంకేతికత, పరిశోధన, పారిశ్రామిక రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. మరి భారతదేశంలో కూడా సహజ వనరులు, అపారమైన మానవ వనరులు ఉన్న అదే స్థాయిలో ఎందుకు అభివృద్ధి చెందలేకపోతోంది? అసలు మన అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నది ఎవరు? సమస్య ఎక్కడ ఉంది?

ఒకసారి భారతదేశాన్ని పరిశీలిస్తే.. ఉత్తరాన హిమాలయాలు, దేశమంతటా విస్తరించిన నదులు, సారవంతమైన వ్యవసాయ భూములు, అడవులు, ఖనిజ సంపద.. మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి. ఇలా ప్రకృతి మనకు అనేక అవకాశాలను అందించింది. అయినప్పటికీ ఆ అవకాశాలను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా మార్చుకోవడంలో మనం ఇంకా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఎందుకు?..

ఇక మనదేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంది. ఈ అపారమైన మానవ వనరు, వీరిలో ఉన్న నైపుణ్యం, శ్రమశక్తి, కొత్త ఆవిష్కరణలకు అవకాశంగా మార్చుకునే విధానంలో మనం ఎందుకు వెనుకబడుతున్నాం.. ఇప్పటికీ ప్రపంచ స్థాయి కంపెనీలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, కీలక ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై మనం ఎందుకు ఆధారపడాల్సి వస్తోంది?.. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను భారతీయ మూలాలున్న ప్రతిభావంతులు నడిపిస్తున్నారు.

అంతర్జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలు చేపడుతున్నారు. సాంకేతికత, వైద్యం, పరిశోధన, ఆర్థిక రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కానీ అదే ప్రతిభను ఉపయోగించుకుని ప్రపంచాన్ని శాసించే స్థాయిలో భారతదేశం ఎదగడంలో ఎందుకు విఫలం అవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇక మన విద్యార్థులు పరీక్షల్లో ర్యాంకుల కోసం పోటీ పడుతున్నారు, కానీ కొత్తదాన్ని సృష్టించడంలో ఎందుకు వెనకబడ్డారు?

సమస్య పిల్లల్లోనా, మన చదువులోనా? రైతు పంట పండిస్తాడు, ఇంకొకరు దాన్ని ప్రాసెస్ చేసి, బ్రాండ్ చేసి, అమ్మి ఎక్కువ సంపాదిస్తారు. మరి అసలు వాల్యూ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? మన దగ్గర ఇనుము, బాక్సైట్, బొగ్గు లాంటి వనరులు ఉన్నాయి, కానీ ముడి పదార్థం అమ్మడం నుండి ప్రపంచానికి ఫినిష్డ్ ప్రొడక్ట్ అమ్మే స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం?..

మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి మనదే, కోట్లాది మంది వర్కర్స్ ఉన్నారు. అయినా మేడ్ ఇన్ ఇండియా కంటే మేడ్ ఇన్ చైనా ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది?.. ఒక వస్తువు ఫ్యాక్టరీ నుంచి పోర్ట్ కి చేరే ప్రతి అదనపు గంట దాని ధరను పెంచుతుంది. ప్రపంచానికి అమ్మాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫిషియంట్ గా ఉండాలి. మనదేశంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉంది..

ఇక ఒక దేశం.. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రకృతి సహకారంతో పాటు.. ఆర్థిక వనరులను ఉపయోగించుకునే నిస్వార్థ గుణం ఉండాలి.. మన దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, టాలెంట్ ఉంది, మనీ కూడా ఉంది. అయినా బిజినెస్ మొదలుపెట్టడానికి సిస్టమ్ లోనే ఎన్నో అడ్డంకులు ఉంటే ఇన్నోవేషన్ ఎలా పెరుగుతుంది? ఈ రోజు నాటిన చెట్టు రేపే నీడను ఇవ్వదు కదా. ఒక ప్రభుత్వం ఐదేళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించగలదు, కానీ ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ నిర్మించడానికి దశాబ్దాలు పడతాయి.

ఉద్యోగం సంపాదిస్తే మనకి గర్వంగా ఉంటుంది. కానీ అదే ఉద్యోగం వదిలి బిజినెస్ మొదలుపెడితే భయం మొదలవుతుంది. అందుకే ఈ మైండ్ సెట్ ఇన్నోవేషన్ కి సరిపోతుందా? దేశం మారాలని, మంచి రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ కావాలని కోరుకుంటాం. కానీ మనమే రూల్స్ పాటించం. మార్పు మన దగ్గరి నుంచే మొదలవ్వాలి. ఇండియా అభివృద్ధిని ఆపుతున్నది ఒక్క సమస్య కాదు.. ఎడ్యుకేషన్ లో లోపాలు, సిస్టమ్ లో అడ్డంకులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో డిలేస్, మైండ్ సెట్ లో భయాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి.

మరోవైపు ఇండియాని వచ్చే 20 ఏళ్లలో మార్చాలంటే ముందు దేన్ని మార్చాలి? ఎడ్యుకేషన్ నా? సిస్టమ్ నా? మైండ్ సెట్ నా? లీడర్ షిప్ నా? అంటే మనదగ్గర మాత్రం సరైన సమాధానం ఉండదు.. అంటే మన నేతల నుండి సామాన్య ప్రజల వరకు క్లారిటీ లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తున్నారని అర్థం అవుతుంది.. ఇక ప్రపంచ పటంలో భారతదేశం ఒక భూభాగం మాత్రమే కాదు.. ప్రపంచానికి జ్ఞానం, వైద్యం, ఆధ్యాత్మికత, మానవతా విలువలను అందించిన మహనీయుల జన్మభూమి!..

ప్రతి ఒక్కరూ వ్యాపారవేత్త కావాల్సిన అవసరం లేదు. స్థిరమైన ఉద్యోగం కోరుకోవడంలో తప్పు కూడా లేదు. అయితే కొత్త ఆలోచనలను ప్రయత్నించే వారికి, పరిశోధనలు చేసే వారికి, వ్యాపారాలు ప్రారంభించే వారికి సమాజం ప్రోత్సాహం ఇవ్వాలి. వైఫల్యాన్ని జీవితాంతం ముద్రగా చూడకుండా, దాని నుంచి పాఠం నేర్చుకుని మళ్లీ ముందుకు వెళ్లే అవకాశాలు కల్పించాలి. అప్పుడే సృజనాత్మకతకు, ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.

భారతదేశానికి ప్రకృతి సంపద ఉంది.. మానవ వనరులు ఉన్నాయి.. ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన చరిత్ర ఉంది. ఇప్పుడు కావాల్సింది ఆ బలాలన్నింటినీ సమన్వయపరిచి, విద్య నుంచి పరిశోధన వరకు, వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, పాలన నుంచి పౌర బాధ్యత వరకు ప్రతి రంగంలోనూ నాణ్యతకు, సృజనాత్మకతకు, దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకోవాలి..

ఆనాడు భారతీయ మూలాలున్న బోధిధర్ముడు చైనా చేరుకుని ధ్యాన సంప్రదాయాల వ్యాప్తికి, షావోలిన్ మార్షల్ ఆర్ట్స్ చరిత్రలో ఏర్పడిన సంప్రదాయాలకు ప్రేరణగా నిలిచారు. బౌద్ధాన్ని ఆసియాలో విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన బోధిధర్ముడితో పాటు, చైనాలో బౌద్ధ గ్రంథాల అనువాదానికి కృషి చేసిన కుమారజీవుడు, టిబెట్‌లో బౌద్ధ తత్వాన్ని బోధించిన శాంతరక్షితుడు కూడా విశేష గుర్తింపు పొందారు.

ఇక దేశం మారాలని మనం కోరుకుంటాం. మంచి రోడ్లు కావాలని, మెరుగైన ఆసుపత్రులు కావాలని, నాణ్యమైన పాఠశాలలు కావాలని, అవినీతి తగ్గాలని ఆశిస్తాం. కానీ అదే సమయంలో మనలో ప్రతి ఒక్కరం నిబంధనలు పాటిస్తున్నామా? ప్రజా ఆస్తులను కాపాడుతున్నామా? పన్నులు, పౌర బాధ్యతల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తున్నామా? రహదారులపై క్రమశిక్షణ పాటిస్తున్నామా? అనే ప్రశ్నలను కూడా మనకు మనమే వేసుకోవాలి.

ప్రభుత్వాల బాధ్యతలను పౌరులపైకి నెట్టడం ఎంత తప్పో, పౌర బాధ్యతలను పూర్తిగా ప్రభుత్వాలకే వదిలేయడం కూడా అంతే తప్పు. ప్రజాస్వామ్యంలో పాలకుల జవాబుదారీతనం, సమర్థమైన సంస్థలు, చట్టాల అమలు, పౌరుల బాధ్యత.. ఇవన్నీ కలిసినప్పుడే సమాజంలో స్థిరమైన మార్పు సాధ్యమవుతుంది. మొత్తంగా భారతదేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నది ఒక్క సమస్య కాదని తెలుస్తుంది.

విద్యావిధానంలోని లోపాలు, పరిశోధనలకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, వ్యవస్థాగత అడ్డంకులు, మౌలిక సదుపాయాల్లో అసమానతలు, పారిశ్రామిక రంగంలో ఉన్న సవాళ్లు, సామాజిక దృక్పథంలోని భయాలు.. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. అయితే ఈ సమస్యలన్నింటినీ అధిగమించే సామర్థ్యం కూడా భారతదేశానికి ఉంది. మన యువత, శాస్త్రవేత్తలు, రైతులు, కార్మికులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు దేశానికి అతిపెద్ద బలం.

వారికి నాణ్యమైన విద్య, పరిశోధనలకు అవసరమైన వనరులు, సమర్థమైన పాలన, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం, సమాన అవకాశాలు కల్పించగలిగితే భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకమైన స్థానాన్ని సంపాదించుకోగలదు. మరోవైపు భారతదేశానికి ప్రకృతి సంపద ఉంది.. మానవ వనరులు ఉన్నాయి.. ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన చరిత్ర ఉంది. ఇప్పుడు కావాల్సింది ఆ బలాలన్నింటినీ సమన్వయపరిచి, విద్య నుంచి పరిశోధన వరకు, వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు, పాలన నుంచి పౌర బాధ్యత వరకు ప్రతి రంగంలోనూ నాణ్యతకు, సృజనాత్మకతకు, పారదర్శకతకు, దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం.

అప్పుడే భారతదేశం గత వైభవాన్ని చెప్పుకునే దేశంగా మాత్రమే కాకుండా, ప్రపంచ భవిష్యత్తును నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషించే దేశంగా ఎదగగలదనే అభిప్రాయాలున్నాయి.. ఇక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే.. వాటి విజయానికి సహజ వనరుల కంటే వాటిని ఉపయోగించుకునే విధానం, ప్రభుత్వాల పనితీరు, విద్యా ప్రమాణాలు, పారిశ్రామిక విధానాలు, ప్రజల ఆలోచనా దృక్పథం ఎక్కువగా దోహదపడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని దేశాలు అనుసరిస్తున్న విధానాలు భారతదేశంలోని వ్యవస్థలలో ఉన్న లోపాలను స్పష్టంగా తెలియచేస్తున్నాయి..

#India Economic Development#Indian Innovation and Technology#Education System Reform#Make in India#Industrial Growth and Manufacturing#Research and Development#Infrastructure Development#Agricultural Value Addition#Indian Knowledge Heritage#India Development Challenges
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి