Elon Musk: "నేను ఏ రాజకీయ పార్టీకి గుడ్డిగా కొమ్ముకాయను.. ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రవాహం ప్రమాదకరం.. ఇకపై రాజకీయాల కోసం పైసా కూడా విదిలించను!" ఇలా మైకులు దొరికినప్పుడల్లా, అలాగే తన సొంత 'ఎక్స్' ఖాతాలోనూ సుద్దులు చెప్పడంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కి మించిన వారు మరొకరు ఉండరు. భారతదేశంలో రిలయన్స్ వంటి సంస్థలు ప్రభుత్వాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని గతంలో ప్రవచనాలు వండివార్చిన ఈ టెక్ టైకూన్.. ఇప్పుడు తన సొంత దేశమైన అమెరికాలో చేస్తున్నదేంటి? కేవలం రాజకీయ అధికారాన్ని శాసించడానికి, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏకంగా రూ.3,000 కోట్లకు పైగా నిధులను ఎన్నికల బరిలోకి కుమ్మరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. నీతులు చెప్పడం వేరు.. సొంత లాభం చూసుకోవడం వేరు అని మస్క్ చేతలే నిరూపిస్తున్నాయి.
'ఒక్క రూపాయి ఇవ్వను' అని.. వేల కోట్లు
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం సుమారు 290 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టిన తర్వాత.. ఇకపై రాజకీయ ఫండింగ్లకు దూరంగా ఉంటానని 2025లో మస్క్ స్వయంగా ప్రగల్భాలు పలికారు. కానీ ఆ మాటలన్నీ కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితమని ‘ది న్యూయార్క్ టైమ్స్’ తాజా పరిశోధనాత్మక నివేదికతో బట్టబయలైంది. రాబోయే మిడ్-టర్మ్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, రిపబ్లికన్ పార్టీకి పట్టున్న కాంగ్రెస్‌ను కాపాడుకునేందుకు మస్క్ ఇప్పటివరకు ఏకంగా $366 మిలియన్లు (రూ.3,000 కోట్లకు పైగా) వెచ్చించారు.
ముఖ్యంగా ఒక్క జూలై నెల నుంచే దాదాపు $276 మిలియన్లను రిపబ్లికన్ సూపర్ ప్యాక్‌లకు తరలించారు. సెనేట్ లీడర్షిప్ ఫండ్‌కు ఏకంగా $158 మిలియన్లు, సొంత విభాగమైన 'అమెరికా ప్యాక్'కు $76 మిలియన్లు, హౌస్ రిపబ్లికన్ల కోసం మరో $20 మిలియన్లు, గవర్నర్లు, అటార్నీ జనరల్స్ రేసుల కోసం మరో $12 మిలియన్లు.. ఇవి కేవలం ఎన్నికల సంఘం రికార్డుల్లో కనిపించే బహిరంగ విరాళాలు మాత్రమే. రహస్య డోనర్ గ్రూపులు ద్వారా తెరవెనుక ఇంకెన్ని వేల కోట్లు పారించారో లెక్కే తేలడం లేదనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి.
టెక్సాస్ కోసమే అసలు డ్రామా..
ప్రజాస్వామ్య విలువలు, స్వచ్ఛమైన పాలన అంటూ మాట్లాడే మస్క్.. ఈ మొత్తం నిధుల్లో సింహభాగాన్ని కేవలం టెక్సాస్ రాష్ట్రం పైనే ఎందుకు కుమ్మరిస్తున్నారనే ప్రశ్నకు ఆయన వ్యాపార సామ్రాజ్యమే సమాధానం చెబుతోంది. టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్, ది బోరింగ్ కంపెనీల హెడ్‌క్వార్టర్స్ అన్నీ టెక్సాస్‌లోనే ఉన్నాయి. అక్కడ తమ ప్రాజెక్టులకు పన్ను మినహాయింపులు దక్కాలన్నా, ఎలాంటి ప్రభుత్వ ఆంక్షలు రాకూడదన్నా స్థానిక ప్రభుత్వం తన గుప్పిట్లోనే ఉండాలి.
అందుకే టెక్సాస్ సెనేట్ ఎన్నికల్లో డెమోక్రాట్ జేమ్స్ తలారికోను ఓడించి, రిపబ్లికన్ కెన్ పాక్స్టన్ను గెలిపించడానికి మస్క్ ఎంతకైనా తెగిస్తున్నారు. దాదాపు 3,000 మంది పెయిడ్ ఏజెంట్లను పెట్టి, ఒక్కో ఇంటి తలుపు తట్టినందుకు $1.5 నుంచి $3 వరకు డాలర్లు విసురుతూ 65 లక్షల ఇళ్లను చుట్టేస్తున్నారు. ఒకప్పుడు ప్రచారంలో డబ్బు వాడకాన్ని తప్పుబట్టిన మనిషే, ఇప్పుడు డాలర్లతో ఓటర్లను ప్రభావితం చేసే కార్పొరేట్ మాస్టర్‌మైండ్‌గా మారారు.
అవినీతి రహిత పాలన పేరుతో.. వేల కోట్ల కాంట్రాక్టులు
ఒకవైపు అధికారికంగా 'డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' అంటూ పదవిలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తానని ఆర్భాటం చేసిన ఆయన, స్పేస్ఎక్స్ కోసం అమెరికా ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను దక్కించుకోవడం తన పక్కా వ్యాపార వ్యూహానికి నిదర్శనం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇతర దేశాల కార్పొరేట్లు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే "క్రోనీ క్యాపిటలిజం" అని పాఠాలు చెప్పే మస్క్.. ఇప్పుడు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద పొలిటికల్ డోనార్‌గా మారి నేరుగా ప్రభుత్వాన్ని, ఎన్నికలను కొనే స్థాయికి దిగజారడం ఆయన నైతిక పతనానికి నిదర్శనమని డెమోక్రాట్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి కార్పొరేట్ దందాలు అన్నట్లుగా తయారైంది ఎలాన్ మస్క్ తీరు. ప్రజాస్వామ్యం ముసుగులో తన బిలియన్ డాలర్ల వ్యాపారాలను కాపాడుకునేందుకు ఆయన పారుస్తున్న ఈ నోట్ల వర్షం.. అగ్రరాజ్య రాజకీయాల్లో నిజమైన స్వతంత్రతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది.


