అభిప్రాయం

Indian politics: ఇండియన్ పాలిటిక్స్ ఏం నేర్పుతున్నాయి?

రచన: Venu•••13 నిమిషాల పఠనం

భారత రాజకీయ చరిత్రలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుల త్యాగాల నుంచి నేటి అధికార పోరాటాల వరకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు కనిపిస్తారు..

భారత రాజకీయ చరిత్రలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుల త్యాగాల నుంచి నేటి అధికార పోరాటాల వరకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు కనిపిస్తారు.. కానీ నేడు అధికారం, ఆర్థిక బలం, ఎన్నికల వ్యూహాలు, ప్రచార ఆర్భాటం రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అలాగే ఓటు బ్యాంక్ రాజకీయాలు పురుడు పోసుకున్నాయి.

కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ఓట్లను చీల్చే కుతంత్రాలు మొదలయ్యాయి. భావజాలమే ఆధారంగా ఒకప్పుడు సాగిన రాజకీయాలు, క్రమంగా వ్యాపారంగా రూపాంతరం చెందాయి. సిద్ధాంతాల కంటే గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత పెరిగింది. అదేవిధంగా నేడు రాజకీయాలు డిజిటలైజ్ అయ్యాయి... సోషల్ మీడియా ప్రచారాలు, కోట్లాది రూపాయల ప్రకటనలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లా మారాయి.

ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత దూషణలు, ప్రధాన అంశాలను దారి మళ్లించే ట్రిక్కులే నేటి రాజకీయ వ్యూహాలుగా మారిపోయాయి. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు.. పేదరికాన్ని తొలగించడం, ఆకలిని నిర్మూలించడం, అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడం, కులమత భేదాలు లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే మన నాయకుల ముందు ఉన్న అతిపెద్ద లక్ష్యం..

ఈ క్రమంలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వంటి నాయకులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. వీరి ఆలోచనలు, విధానాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడం, దేశ భవిష్యత్తుకు పునాదులు వేయడం నాటి రాజకీయాల ప్రధాన లక్ష్యాలుగా కనిపించేవి.. ఇక 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి రావడం, 1951–52లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరగడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో కీలక ఘట్టాలుగా చెప్పుకుంటారు.

నాడు చదువుకున్నవారికే కాదు.. నిరక్షరాస్యులకు సైతం ఓటు హక్కు కల్పించడం ద్వారా సామాన్యుడికి దేశ పాలనలో భాగస్వామ్యం లభించింది. అప్పట్లో రాజకీయాల్లోకి రావడం అంటే ప్రజల మధ్య ఉండటం, వారితో మమేకమై జనం సమస్యలపై పోరాడటం, త్యాగాలకు సిద్ధపడటం అనే భావన బలంగా ఉండేది. కానీ నేటి రాజకీయాలు ముంచడం, వంచించడం,దోచుకోవడం, దాచుకోవడం అనే ప్రాతిపాదికన ముందుకు సాగుతున్నాయి.

అయితే.. ఆనాటి రాజకీయాలలో కూడా స్వాతంత్ర్యానికి ముందే అధికార దుర్వినియోగం, లంచాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించుకోవడం వంటి సమస్యలు ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అవినీతి పూర్తిగా కనుమరుగవలేదు. 1947లోనే అవినీతి నిరోధక చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి ఉండటం ఇందుకు నిదర్శనం.

మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ నియంత్రణ 1950, 60 దశకాల్లో ఎక్కువగా ఉండేది. పరిశ్రమలు ప్రారంభించాలన్నా, వ్యాపారాలు విస్తరించాలన్నా అనేక అనుమతులు అవసరమయ్యేవి. ఈ లైసెన్సులను పొందే క్రమంలో కొన్ని సందర్భాల్లో లంచాలకు, రాజకీయ పలుకుబడికి అవకాశం ఏర్పడింది. అంటే అవినీతి ఒక రోజున పుట్టలేదు. పరిపాలనలో జవాబుదారీతనం తగ్గినప్పుడు, అధికారానికి పారదర్శకత లేనప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక 1960ల చివరి నుంచి రాజకీయాల్లో పోటీ పెరిగింది. 1967 ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడటం, పార్టీ ఫిరాయింపులు, అధికార మార్పులు రాజకీయాలలో కొత్త మలుపులకు నాంది అయ్యాయి. ప్రజాసేవతో పాటు అధికారాన్ని నిలబెట్టుకోవడం, ప్రత్యర్థులను ఎదుర్కోవడం, ఎన్నికల్లో గెలవడం పార్టీ రాజకీయాల్లో మరింత కీలకంగా మారాయి.. అలాగే భారత ప్రజాస్వామ్యానికి 1975లో ప్రకటించిన ఎమర్జెన్సీ ఒక పాఠాన్ని నేర్పింది.

పత్రికలపై ఆంక్షలు, రాజకీయ ప్రత్యర్థుల నిర్బంధం, పౌర స్వేచ్ఛలపై పరిమితులు.. అధికారం ఒకరి చేతుల్లో కేంద్రీకృతమైతే ప్రజాస్వామ్య సంస్థలు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందో నాడు దేశం చూసింది. ఈ నేపథ్యంలో 1977 ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా.. ఓటరుదే అంతిమ అధికారం అని నిరూపించారు. 1980లలో బోఫోర్స్ వివాదం వంటి ఘటనలు రాజకీయాల్లో అవినీతి అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకొచ్చాయి.

ఈ క్రమంలో ప్రభుత్వ కొనుగోళ్లు, కాంట్రాక్టులు, రక్షణ ఒప్పందాల్లో పారదర్శకత ఎంత ముఖ్యమో ప్రజలకు అర్థమైంది. 1991 ఆర్థిక సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ కొత్త దిశలోకి వెళ్లింది. ఫలితంగా ప్రైవేటు పెట్టుబడులు, వ్యాపారాలు, సాంకేతిక రంగం విస్తరించాయి. అదే సమయంలో రాజకీయాల్లో ఎన్నికల ఖర్చులు పెరగడం ప్రారంభం అయ్యింది. కులం, మతం, ప్రాంతీయ గుర్తింపు, నగదు పంపిణీ, మీడియా ప్రచారం, భారీ సభలు.. ఎన్నికల వ్యూహాల్లో ప్రధానమైన అంశాలుగా మారాయి.

అంతే కాకుండా ప్రజల సమస్యలపై చర్చ ఒకవైపు.. ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలంటే ఓటర్లను ప్రభావితం చేసే పద్ధతులు మరోవైపు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక 2000 సం. తర్వాత టెలికాం లైసెన్సులు, బొగ్గు కేటాయింపులు, కామన్వెల్త్ క్రీడల నిర్వహణ వంటి అంశాలపై వచ్చిన వివాదాలు ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజాధనం వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇక అప్పటి నుండి రాజకీయ విలువలు మరింత దిగజారడం మొదలుపెట్టాయి.. నిజం చెప్పాలంటే 2000 సం. తర్వాత సిగ్గు, శరం, అభిమానం, నిజాయితీ, ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు రాజకీయాలకు పనికి రారనే ముద్ర పడిపోయింది.

ముఖ్యంగా నాటి రాజకీయాలంటే ప్రజాసేవ-దేశ నిర్మాణం. నాయకులకు స్వార్థం కంటే దేశాభివృద్ధి, రాజ్యాంగ విలువలను కాపాడటమే పరమావధిగా ఉండేది. పార్లమెంట్ లోపల, బయట ఎంత తీవ్రమైన విభేదాలు ఉన్నా, వ్యక్తిగత విమర్శలకు తావుండేది కాదు. సిద్ధాంతపరమైన చర్చలు, దేశ భవిష్యత్తు మాత్రమే ప్రధాన అంశాలుగా ఉండేవి. సంక్షేమ పథకాలు, పరిశ్రమల స్థాపన, విద్యా వ్యవస్థ విస్తరణపైనే నాటి రాజకీయాలు నడిచాయి.

కానీ, సమయం గడిచేకొద్దీ 1970-80ల నాటికి భారత రాజకీయాల దిశ మారడం ప్రారంభమైంది. ఒకే పార్టీ ఆధిపత్యం తగ్గి, ప్రాంతీయ పార్టీలు తెరపైకి వచ్చాయి. మెల్లమెల్లగా రాజకీయాలు ఆదర్శాల నుండి అధికార సాధన వైపు అడుగులు వేశాయి. ఒకప్పుడు భావజాలం ఆధారంగా సాగిన రాజకీయాలు, క్రమంగా వ్యాపారం గా రూపాంతరం చెందాయి. సిద్ధాంతాలు చరిత్రలో కలిసిపోయాయి.

ఇక రాజకీయాలకు సోకిన అతిపెద్ద క్యాన్సర్ అవినీతి. దీనికి ఒక్క రోజే పునాది పడలేదు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే 1948 జీప్ స్కామ్, 1950లలో ముంధ్రా స్కామ్ వంటివి వెలుగులోకి వచ్చినా, 1970లో లైసెన్స్ రాజ్‌ వ్యవస్థలో అవినీతి సంచలనంగా మారింది. ఇక ఎన్నికల్లో గెలవడానికి ధన బలం, అంగ బలం తప్పనిసరిగా మారడంతో అవినీతి రాజకీయాల్లో ఒక భాగమైపోయింది.

ప్రస్తుతం కరెప్షన్ లేని రాజకీయాలు లేవు.. ఫలితంగా ఈ రోజుల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పోటీ చేయడమే కష్టంగా మారింది. రాజకీయాల్లో అవినీతి ప్రవేశం జరిగాక చోటు చేసుకున్న పరిస్థితులు కొందరిని అందలం ఎక్కిస్తే.. మరికొందరి రాజకీయ జీవితానికి ఉరితాడులా మారాయి.. నిజాయితీగా, అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నించిన నాయకులు వ్యవస్థలో ఒంటరివారయ్యారు. రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేక పదవులకు రాజీనామాలు చేసినవారు కొందరైతే, ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయి రాజకీయాల నుండి నిష్క్రమించినవారు మరికొందరు.

కేవలం నిజాయితీని మాత్రమే నమ్ముకుని నేడు అధికారాన్ని నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యమనే పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో నాయకులు మారాలా? ప్రజలు మారాలా? వ్యవస్థ మారాలా? అనే ప్రశ్నలు పుట్టడం సహజం.. అయితే ఈ మూడు మారవలసిన అవసరం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. డబ్బు తీసుకొని ఓటు వేస్తే అవినీతిని ప్రశ్నించే నైతిక బలం తగ్గుతుంది.

పార్టీ గుర్తును చూసి తప్పులను సమర్థిస్తే జవాబుదారీతనం బలహీనపడుతుంది. నాయకుడి తప్పును ప్రశ్నించకుండా ప్రత్యర్థి తప్పును మాత్రమే చూపిస్తే ప్రజాస్వామ్యం రాజకీయ ప్రచారానికి పరిమితమవుతుంది. అందుకే మన ఇండియన్ పాలిటిక్స్ మనకు నేర్పే పాఠం ఏమిటంటే.. ఓటర్లు చైతన్యవంతంగా లేకపోతే, నాయకులు వ్యవస్థను వ్యాపారంగా మార్చేస్తారని..

రాజకీయాలు చెడిపోయాయని శాపనార్థాలు పెట్టడం కాదు, నాటి ఆదర్శాలను గుర్తుచేసుకుంటూ, అవినీతిని ప్రశ్నించే ప్రజాస్వామ్య చైతన్యాన్ని పెంచుకోవడమే మనం చేయాల్సిన పని. ఏ రోజు అయితే డబ్బుకు, కులానికి ఓటు అమ్ముడుపోదో... ఆ రోజే మళ్లీ నాటి తరం నిజాయితీ రాజకీయాలు సాధ్యమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకులు శాశ్వతం కాదు.. పార్టీలు శాశ్వతం కాదు.. అధికారం కూడా శాశ్వతం కాదు. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలి.. ప్రజలు రాజకీయ నాయకుల కోసం కాదు. ఈ ఒక్క సూత్రాన్ని ఓటరు మరిచిపోనంతకాలం ప్రజాస్వామ్యం బ్రతికే ఉంటుంది.

#Indian Politics#Indian Political History#Political Corruption#Democracy in India#License Raj#Political Accountability#Electoral Reforms#Political Ethics#Indian Governance#Clean Politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి