* ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో ప్రతీరోజూ సమీక్షలు
* అక్టోబర్ 9 నుండి 14 వరకు 2,474 ప్రత్యేక బస్సుల ఆపరేషన్ శాతం 94.07
* ఖమ్మంలో అత్యధికంగా 133.33%, మెదక్లో 123.15%, ఆదిలాబాద్లో 116.90% ఆపరేషన్ నమోదు
* టీజీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి ప్రకటన
TGSRTC: దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులు అత్యంత ప్రణాళికాబద్ధంగా, విజయవంతంగా కొనసాగుతున్నాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపారు. పండుగ వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ED), అన్ని రీజినల్ మేనేజర్లు (RM) ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఎండీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అక్టోబర్ 9-14 వరకు నడిపిన ప్రత్యేక సర్వీసుల గణాంకాలు..
సంస్థ మొత్తం 2,630 బస్సులను సిద్ధం చేయగా... 2,474 బస్సులను విజయవంతంగా నడిపి 94.07 శాతం లక్ష్యాన్ని సాధించిందని ఎండీ వివరించారు. అక్టోబర్ 10న అమావాస్య రోజున ప్రయాణికుల రద్దీ ఊహించని విధంగా పెరిగినప్పటికీ, కేటాయించిన 529 బస్సులకు గాను 689 బస్సులను నడిపించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు.
జోన్ల వారీగా దసరా పండుగ ప్రత్యేక సర్వీసుల నిర్వహణ వివరాలు..
కరీంనగర్ జోన్ 1,770 బస్సుల లక్ష్యానికి గాను 1,565 బస్సులను నడిపి 88.42 శాతం సాధించింది. ఇందులో ఖమ్మం రీజియన్ నిర్ణయించిన 273 బస్సులకు గాను 364 బస్సులను నడిపి 133.33 శాతంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవగా, ఆదిలాబాద్ రీజియన్ 116.90 శాతం, కరీంనగర్ 94.76 శాతం, వరంగల్ 66.73 శాతం, నిజామాబాద్ 62.69 శాతం ఆపరేషన్ సాధించాయి.
అలాగే హైదరాబాద్ జోన్ 860 బస్సులకు గాను 682 బస్సులను నడిపి 79.30 శాతం ప్రగతిని కనబరిచింది. ఈ జోన్ పరిధిలోని మెదక్ రీజియన్ 123.15 శాతంతో మెరుగైన సేవలు అందించగా, నల్గొండ 79.70 శాతం, మహబూబ్నగర్ 70.17 శాతం, రంగారెడ్డి రీజియన్ 37.74 శాతం ఆపరేషన్ నమోదు చేశాయి. దీనికి అదనంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అదనపు రద్దీని తట్టుకోవడానికి ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకపోయినా ప్రత్యేకంగా 227 బస్సులను అందుబాటులోకి తెచ్చి ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించారు.
అదేవిధంగా 16, 17 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అవసరమైన చోట్ల అదనపు బస్సులను నడపాలని అధికారులను ఆదేశించారు. స్పెషల్ బస్సుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎండీ నాగిరెడ్డి అధికారులకు సూచించారు. పండుగ ముగిసిన అనంతరం తిరిగి నగరాలకు చేరుకునే ప్రయాణికుల కోసం కూడా ఇదే తరహాలో ప్రత్యేక బస్సు సర్వీసులను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలని తెలిపారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఎండీ నాగిరెడ్డి సూచించారు. బస్ స్టేషన్లలో తాగునీరు, విశ్రాంతి వసతులు, పారిశుద్ధ్యం, భద్రత విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రయాణికులందరూ ఆర్టీసీ సేవలనే వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎండీ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.


