ACB: మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా 2.50 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు పట్టుబడ్డారు. 22Aలో ఉన్న భూమి సక్సెషన్ కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేశారు అధికారులు. అడ్వాన్స్ కింద రూ.2.50 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ విజయ్‌కుమార్ రెడ్డి, రికార్డ్ అసిస్టెంట్ బాలకృష్ణను అరెస్ట్ చేశారు.
పక్కా ప్లాన్ ప్రకారం పట్టివేత
భూమి సక్సెషన్ కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేశారు కీసర తహసీల్దార్ కార్యాలయం అధికారులు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్ ప్రకారం రూ.2.50 లక్షల నగదు తీసుకుంటున్న సమయంలో రెవెన్యూ అధికారులను పట్టుకున్నారు. కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్‌రెడ్డి రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తీవ్ర కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాఫ్తు జరుపుతున్నారు.
22ఏలో ఉన్న భూమి సక్సెషన్ కోసం 5లక్షలు డిమాండ్
కీసరకు చెందిన వ్యక్తి భార్య మృతి చెందటంతో ఆమె పేరు మీదున్న 3 ఎకరాల భూమి సక్సెషన్ కోసం కీసర రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. అయితే, ఆ భూమి 22ఏలో ఉండటంతో సక్సెషన్ పూర్తి చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ 5లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడని ఏసీబీ అధికారులు తెలిపారు. 22ఏ నుంచి తీయాలంటే తహసీల్దార్ తో పాటు ఆర్డీవో ఆఫీసులో కూడా డబ్బులు ఇవ్వాలని బాధితుడితో చెప్పారని అన్నారు. దీంతో బాధితుడు మొదటి విడతగా రెండున్నర లక్షలు సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. అతడు ఆ డబ్బుని ఎమ్మార్వో ఆఫీస్ లోని రికార్డ్ అసిస్టెంట్ బాలకృష్ణకు ఇచ్చినట్లుగా తెలిపారు. బాలకృష్ణ ఆ డబ్బుని డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి గదిలోకి తీసుకెళ్లి అతడి బ్యాగులో పెడుతున్న సమయంలో రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు వివరించారు.
వరుసగా అరెస్టులు.. అయినా మారని తీరు
రెవెన్యూ అధికారులను అరెస్ట్ చేసిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రికార్డులను, ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు కీలక పత్రాలు, దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆఫీసులోని ఇతర సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎర వేసి మరీ లంచాలకు రుచి మరిగిన అధికారులను పట్టుకుంటున్నారు.
ఇప్పటికే పలు భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కాయి. ఏసీబీ అధికారులు వరుసగా సోదాలు నిర్వహిస్తున్నా, లంచాలు తీసుకుంటున్న అధికారులను అరెస్ట్ చేస్తున్నా.. ఇంకా కొందరు ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. లంచాలు డిమాండ్ చేయడం ఆపడం లేదు. లంచం తీసుకోవడం చట్టరిత్యా నేరం అని తెలిసినా మానుకోవడం లేదు.


