తెలంగాణ

శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లే.. పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయి- సీఎం రేవంత్ ఆందోళన

రచన: NK•••6 నిమిషాల పఠనం

ఎల్ నినో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లే పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నామన్న ఆయన.. ప్రజలు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చలికాలం

Elnino: ఎల్ నినో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లే పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నామన్న ఆయన.. ప్రజలు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చలికాలం ఎండా కాలంలా ఉందని వాపోయారు. ఎండా కాలంలో ఉండాల్సిన ఎండలు ఇప్పుడు ఉంటున్నాయన్నారు. గతంలో చాలాసార్లు ఎల్ నినో వచ్చిన ఈస్థాయిలో ప్రభావం చూపలేదన్నారు. ఈసారి సూపర్ ఎల్ నినో వచ్చిందన్నారు. ఎల్ నినో పై ప్రజలను, రైతులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.

20వేల మెగావాట్లకు విద్యుత్ డిమాండ్

ఏకంగా 30లక్షల పంపు సెట్లు ఆన్ చేయడం, దీనికి తోడు ఎండల తీవ్రతతో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ కనీవిని ఎరుగని విధంగా 20వేల మెగావాట్లకు చేరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్ నినో అంశంపై మంత్రులతో కీలక సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్. ఏ ప్రకృతి విపత్తు అయినా మొదట రైతులపైనే ప్రభావం చూపుతుందన్నారు. ఈ సూపర్ ఎల్ నినో కారణంగా ప్రజలు నీటి సమస్యనే కాకుండా విద్యుత్ సమస్యను కూడా ఎదుర్కోబోతున్నారని సీఎం రేవంత్ హెచ్చరించారు.

ఏపీ, కేరళం, తమిళనాడులోనూ విద్యుత్ సంక్షోభం

ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కేరళం, తమిళనాడులోనూ విద్యుత్ సంక్షోభం ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఎన్ని డబ్బులు పెట్టినా మార్కెట్ లో విద్యుత్ దొరకని పరిస్థితి ఉందని వాపోయారు. చేతికొచ్చిన పంట ఎండిపోవద్దనే విద్యుత్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పరిశ్రమలకు, రైతులకు వీలైనంత మేరకు కరెంటు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పుడు 209 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని, ఆ నీటిని సాగుకు వినియోగిస్తే నారుకు మాత్రమే సరిపోతాయని సీఎం రేవంత్ వెల్లడించారు.

సాగుకి ఇస్తే తాగు నీరు కూడా దొరకదు

సాగు కోసం వినియోగిస్తే తాగు నీటికి ఇబ్బంది వస్తుందన్నారు. ఎల్ నినోను ఎదుర్కోవడానికి రైతులు సహకరించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. రాబోయే 8 నుంచి 10 నెలల వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మొదటి ప్రాధాన్యతగా తాగునీటి కోసమే నీటిని వినియోగించుకోవాలన్నారు. రైతులు ఎండా కాలంలో వరి పంటలు వేయడం తగ్గించుకోవాలని సీఎం రేవంత్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మి వరి పంటను వేస్తే నష్టపోతారని రైతులను హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్.

కోవిడ్ లాంటి సంక్షోభం.. రెండో పంట వద్దు..

''ఎల్ నినో ఒక ప్రకృతి విపత్తు, ప్రకృతి ప్రకోపం. కోవిడ్ లాంటి సంక్షోభం ఎల్ నినో. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని వణికిస్తున్న సంక్షోభం ఎల్ నినో. గ్లోబల్ వార్నింగ్ కారణంగానే ఎల్ నినో విపత్తు. అందరం కలిసి కోవిడ్ ను ఎదుర్కొన్నట్లే ఎల్ నినోను ఎదుర్కొందాం. నీళ్లు లేవు, రెండో పంట వద్దు. ఇది కరువు కాదు.. మహా విపత్తు..ప్రజలారా జాగ్రత్త. రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతోంది.

ప్రజలందరి సహకారం ఉంటేనే బయటపడగలం..

ఎల్ నినో దృష్ట్యా కేంద్రం సహకారం తీసుకుంటాం. రైతు కూలీల కోసం ఉపాధి హామీ పనులను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తాం. ప్రభుత్వానికి రాజకీయ పార్టీలు, సంఘాలు సహకరించాలి. అందరం కలిసికట్టుగా ప్రకృతి విపత్తును ఎదుర్కోవాలి. ఎల్ నినో పై వార్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తాం. నిరంతరం పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటాం. సాగునీరు విషయంలో పొదుపు పాటించాలి. విద్యుత్ ను ఆదా చేయాలి. ప్రజలందరి సహకారం ఉంటే సమస్య నుంచి బయటపడగలం'' అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

#Elnino#Cm Revanth Reddy#Telangana#Power Demand#Rains#Drinking Water#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి