తెలంగాణ

నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి! పెద్ది స్వప్నకు సమన్వయ బాధ్యతలు!

రచన: Mahesh•••5 నిమిషాల పఠనం

TG: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టి, కేడర్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త వ్యూహంతో ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

TG: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టి, కేడర్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త వ్యూహంతో ముందుకు రాబోతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే నర్సంపేట నియోజకవర్గ పార్టీ పగ్గాలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి తాత్కాలికంగా అప్పగించబోతున్నారనే చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

కేటీఆర్ కీలక భేటీ..

ఈ ప్రతిపాదనలపై క్లారిటీ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. నర్సంపేటలో పార్టీ పరిస్థితి, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ భేటీలో నేతలతో చర్చించి, ఇన్‌చార్జి నియామకంపై అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా వివరించబోతున్నట్లు తెలుస్తోంది.

నర్సంపేటలో పార్టీ కేడర్ బలంగా ఉన్నప్పటికీ, నాయకత్వ సమన్వయం లోపించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావాలన్నా, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలన్నా చురుకైన నాయకుడు ఉండాలని భావించిన అధిష్టానం.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని తాత్కాలిక ఇన్‌చార్జిగా రంగంలోకి దించాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా నేతల్లో మంచి పట్టు ఉండటంతో పాటు, అందరినీ కలుపుకుని పోగలరనే ఉద్దేశంతోనే ఆయనకు ఈ బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

పెద్ది కుటుంబానికి సమ ప్రాధాన్యం..

నియోజకవర్గంలో మొదటి నుంచీ పార్టీకి అండగా నిలబడిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం ప్రాధాన్యతకు ఎక్కడా లోటు రాకూడదనేది కేటీఆర్ ప్రధాన ఆలోచనగా కనిపిస్తోంది. కొత్తవారిని ఇన్‌చార్జిగా నియమిస్తే పెద్ది వర్గంలో ఎలాంటి అసంతృప్తి రాకూడదనే ఉద్దేశంతో ఒక బ్యాలెన్సింగ్ ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నకు నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంటే నియోజకవర్గంలో ఏ నిర్ణయం తీసుకున్నా పెద్ది కుటుంబం ప్రమేయం ఉండేలా, ఇటు పోచంపల్లి - అటు పెద్ది స్వప్న కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లేలా పక్కాగా రోడ్‌ మ్యాప్ రూపొందించినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చర్యలతో నర్సంపేట బీఆర్ఎస్ లో అంతర్గత విబేధాలు సమసిపోయి, కేడర్ మళ్లీ యాక్టివ్ అవుతుందన్నది పార్టీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది.

#Telangana Politics#BRS#Narsampet#Pochampally Srinivas Reddy#KTR#K Chandrashekar Rao#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి