రాష్ట్రంలో వరుణుడి అలక.. సూర్యుడి ప్రతాపం.. వెరసి ఎల్నినో ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవక, వేసిన పంటలు ఎండిపోతుంటే.. పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుందో లేదో తెలియని దుస్థితిలో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు వర్షాల కోసం ఎదురుచూపులు.. ఇంకోవైపు పెరుగుతున్న సాగు ఖర్చులు.. ఇవన్నీ కలిసి రైతు జీవితాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు బీళ్లుగా మారుతుంటే.. అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతన్నలు దిగాలు పడుతున్నారు.
వాతావరణ మార్పులు ఇలాగే కొనసాగితే వ్యవసాయ దిగుబడులపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా, పశుగ్రాసం, తాగునీటి కొరత కూడా పెరిగే ప్రమాదం ఉందనే సంకేతాలు వెలువడుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇక పంటలు దెబ్బతింటే ఆ ప్రభావం రైతు కుటుంబాలపైనే కాదు.. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుల వంటింటిపైనా భారం పడే అవకాశం ఉంది.
ప్రకృతి పెడుతున్న ఈ పరీక్ష అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు, రైతులకు సవాల్ గా మారింది. ఇప్పటికే ఉచిత రేషన్ బియ్యం పై ఈ ప్రభావం పడుతుందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎల్నినో, వర్షాభావ పరిస్థితులపై అధికారులు ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక సమర్పించారు.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 320 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని తమ నివేదికలో స్పష్టం చేశారు. అందులోనూ 117 మండలాల్లో తీవ్రమైన కరువు తాండవిస్తోందని అధికారులు వెల్లడించారు. ఎల్నినో తీవ్రత, దాని వల్ల కలిగే ప్రభావాలపై సీఎం సలహాదారు రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మరోవైపు కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, ప్రజా ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఈ సందర్భంగా డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తున్నట్టు పేర్కొంది. కాగా కరువు పరిస్థితులను అధిగమించేందుకు, తాగునీరు, సాగునీరు, పంట నష్టాల నివారణకు ఈ సబ్ కమిటీ రోడ్ మ్యాప్ సిద్ధం చేయనుంది. ఇక రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక కరువు అనేది ప్రకృతి ప్రకోపమే కాదు, మానవాళి మనుగడకే ఒక పెద్ద సవాలుగా మారనుందనే భయాలు నెలకొంటున్నాయి.
మరోవైపు చరిత్రలో కరువు అనేది లక్షలాది కుటుంబాలను రోడ్డున పడేసిన మహా విషాదం. వర్షాలు విఫలమైన ప్రతిసారీ పంటలు ఎండిపోయాయి.. తాగునీటి కోసం ప్రజలు అల్లాడారు.. ఆహారం దొరక్క లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1876 నుంచి 1878 వరకు.. బ్రిటిష్ పాలనలో సంభవించిన మహా కరువు దక్షిణ, మధ్య భారతదేశాన్ని అతలాకుతలం చేసింది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్, బొంబాయి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పంటలు పండక, ఆహారం అందక.. ఆకలి, అంటువ్యాధులతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 1899–1900 మధ్య మరో భయంకరమైన కరువు దేశాన్ని కుదిపేసింది. రాజస్థాన్, గుజరాత్, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురవక పంటలు ఎండిపోవడంతో పాటు పశుగ్రాసం కరువైంది. వేలాది గ్రామాల్లో జీవనాధారమైన వ్యవసాయం దెబ్బతింది. ఆకలి, వ్యాధులు, పశువుల మరణాలతో ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.
అదేవిధంగా 1943 బెంగాల్ లో సంభవించిన కరువు భారత చరిత్రలో అత్యంత విషాదకరమైన విపత్తుల్లో ఒకటిగా చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం, ఆహార సరఫరాలో అంతరాయాలు, ధరల పెరుగుదల, ప్రభుత్వ విధానాలు, పరిపాలనా వైఫల్యాలు కలిసి పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఆహారం కొనుగోలు చేసే స్తోమత లేక లక్షలాది మంది ఆకలితో అలమటించారు.
ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారత్కు కరువు సవాళ్లు తప్పలేదు. 1965–66లో వరుసగా వర్షాలు లేకపోవడంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దేశం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంది. విదేశాల నుంచి గోధుమల దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. అలాగే 1972లో మహారాష్ట్రతో పాటు పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. తాగునీటి కోసం ప్రజలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది.. వ్యవసాయ కూలీలకు పనులు తగ్గిపోయాయి. పశువులకు మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. కరువు ప్రభావం కేవలం రైతులకే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది..
ఇక 1987లో దేశవ్యాప్తంగా రుతుపవనాలు రాకపోవడంతో అనేక రాష్ట్రాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోట్లాది మంది ప్రజలు కరువు ప్రభావానికి గురయ్యారు. నీటి కొరత, పశుగ్రాసం సమస్యలు, గ్రామీణ ఉపాధి సంక్షోభం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారాయి. అలాగే 2002లోనూ రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడటంతో దేశ వ్యవసాయ రంగం దెబ్బతింది. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతాల్లో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు.
వర్షపాతం లోటు కారణంగా పంటల దిగుబడులు తగ్గాయి. నీటి నిల్వలపై ఒత్తిడి పెరిగింది. అయితే నేడు వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎల్నినో వంటి వాతావరణ పరిణామాల నేపథ్యంలో ఈ గత అనుభవాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో కరువును పూర్తిగా ఆపలేకపోయినా, ముందస్తు చర్యలతో దాని వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు. రైతు పంటను కాపాడటం, ప్రతి కుటుంబానికి ఆహారం అందించడం, తాగునీటిని భద్రపరచడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. ఆ దిశగా వేగవంతమైన చర్యలు చేపడితే కొంతవరకైన ప్రజలను కష్టాల నుండి గట్టెక్కించే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు..


