సినిమా

Tollywood: టాలీవుడ్‌ను వణికిస్తున్న కత్తెరల రాజ్!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

Tollywood: కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, వందలాది మంది శ్రమతో ఒక కథను తెరకెక్కించిన నిర్మాతలకు షూటింగ్ పూర్తి కావడం ఒక ఎత్తయితే.. సెన్సార్ గది దాటడం మరో ఎత్తుగా మారింది. థియేటర్లలో ప్రేక్షకుల తీర్పు రాకముందే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వద్ద పడే కత్తెర దెబ్బలకు సినిమా రూపురేఖలే మారిపోతున్నాయి.

Tollywood: కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, వందలాది మంది శ్రమతో ఒక కథను తెరకెక్కించిన నిర్మాతలకు షూటింగ్ పూర్తి కావడం ఒక ఎత్తయితే.. సెన్సార్ గది దాటడం మరో ఎత్తుగా మారింది. థియేటర్లలో ప్రేక్షకుల తీర్పు రాకముందే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వద్ద పడే కత్తెర దెబ్బలకు సినిమా రూపురేఖలే మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం సినిమాను చూసి ఏ వయసు వారు చూడాలో ధ్రువీకరించే సర్టిఫికేషన్ బోర్డు, నేడు దర్శకుల సృజనాత్మకతను కట్టడి చేస్తూ చిత్రాల మనుగడనే శాసించే స్థాయికి చేరిందన్న ఆగ్రహం చిత్ర పరిశ్రమలో వ్యక్తమవుతోంది.

పెద్ద హీరోలకూ తప్పని తిప్పలు

ముఖ్యంగా పాన్-ఇండియా రేంజ్‌లో రూపొందే భారీ బడ్జెట్ సినిమాలకు సెన్సార్ ఆంక్షలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి. గతంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ విషయంలో ఫైట్ సీన్ల నిడివిని తగ్గించేందుకు మేకర్స్ అంగీకరించకపోవడంతో బోర్డు ఏకంగా ‘ఏ’ (A) సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఫలితంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు దూరమై బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం పడింది. ఇక రణబీర్ కపూర్ ‘యానిమల్’ చిత్రంలోనూ కీలక సంభాషణలకు సౌండ్ మ్యూట్ చేయడంతో పాటు కొన్ని సన్నివేశాలను తొలగించాల్సి వచ్చింది. బహుభాషల్లో విడుదలయ్యే సినిమాలకు ఒకచోట గ్రీన్ సిగ్నల్ వచ్చినా, వేరే రాష్ట్రాల ప్రాంతీయ కార్యాలయాల్లో అధికారులు కొత్త కొర్రీలు పెడుతుండటంతో రిలీజ్ తేదీలు తలకిందులై బయ్యర్లు, నిర్మాతలు లబోదిబోమంటున్నారు.

చిన్న సినిమాలపై చావుదెబ్బ

చిన్న సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు తీరు మరింత దారుణంగా ఉంటోందనే విమర్శలున్నాయి. కథలోని అంతరార్థాన్ని చూడకుండా కేవలం టైటిళ్లను పట్టుకుని వేధించడం నిర్మాతలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. సంతోష్ శోభన్ నటించిన 'కపుల్ ఫ్రెండ్లీ' టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసి పేరు మార్చాలని ఒత్తిడి తేవడం, సుహాస్ చిత్రం 'హే భగవాన్' వివాదాలు దీనికి నిదర్శనం. చివరి నిమిషంలో 'వానర' సినిమా పేరును 'వనవీర'గా మార్పించడంతో అంతకుముందు చేసిన కోట్ల రూపాయల ప్రచారమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. 'నెరవేరిన కల' చిత్రంలో 'నక్సలిజం' అనే పదాన్ని తొలగించమనడం, 'దీవానా' చిత్రానికి సర్టిఫికేషన్ ఆలస్యం చేసి విడుదలనే దెబ్బతీయడం వంటి ఘటనలు చిన్న నిర్మాతల నడ్డి విరుస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

చేతులు కట్టేసిన కొత్త రూల్

ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తూ ఇటీవల అమల్లోకి వచ్చిన 'రీ-ఎడిటింగ్ బ్యాన్' దర్శకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో సినిమా విడుదలైన తొలిరోజే ప్రేక్షకుల స్పందనను బట్టి బోర్ కొట్టే సీన్లు, సాగదీతను కత్తిరించి చిత్రాన్ని బతికించుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు సెన్సార్ పూర్తయ్యాక థియేటర్లలో ఒక్క ఫ్రేమ్ కూడా మార్చడానికి వీల్లేదని నిబంధన విధించడం మేకర్స్ చేతులు కట్టేయడమే అవుతోంది. దీనికితోడు తెరపై ప్రతి డ్రగ్ సీన్‌కు పెద్ద పెద్ద వార్నింగ్ బోర్డులు వేయమనడం అసలైన సినిమాటిక్ అనుభూతిని నాశనం చేస్తోందని సినీ ప్రియులు పెదవి విరుస్తున్నారు.

1952 నాటి సినిమా చట్టాన్ని అడ్డం పెట్టుకుని, ఆధునిక సమాజానికి తగ్గట్లు మారుతున్న కథలపై పాతకాలపు రూల్స్‌ను రుద్దడం కళాత్మక స్వేచ్ఛను హరించడమే. రేపటి రోజున ఓటీటీలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపైనా ఇలాంటి పెత్తనమే కొనసాగితే స్వతంత్ర ఆలోచనలతో సినిమాలు తీయడం అసాధ్యంగా మారుతుందన్నది పరిశ్రమ వర్గాల ఆవేదన.

#Tollywood#Telugu Cinema#CBFC#Censor Board#Film Censorship#Telugu Film Industry#Prabhas#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి