TG: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న తాగు, సాగునీటి ఎద్దడిపై రాజకీయ యుద్ధం ముదిరింది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి విధానాల వల్లే రాష్ట్రం నేడు ఈ దుస్థితికి చేరిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఏకంగా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో వృథాగా పోశారని ఆయన నిప్పులు చెరిగారు. ఎల్‌నినో పరిస్థితులపై మంత్రులతో సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్.. కేసీఆర్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే ఆ ప్రత్యేక వెసులుబాటు ఎందుకు?
ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపుపై రేవంత్‌రెడ్డి సంచలన వివరాలు బయటపెట్టారు. "కొండపోచమ్మ సాగర్ నుంచి పంచపాండవుల చెరువుకు ప్రత్యేకంగా కాలువ తవ్వించారు. అక్కడి నుంచి భారీ మోటార్ల ద్వారా నేరుగా నీటిని ఎత్తిపోస్తూ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తరలిస్తున్నారు. రాష్ట్రంలో సామాన్య రైతులకు, ఏ ఒక్క పౌరుడికీ లేని ఈ ప్రత్యేక సదుపాయం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మాత్రమే ఎలా వచ్చింది? ఈ అక్రమ నీటి ఎత్తిపోతలపై నిజనిర్ధారణ చేయడానికి మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం" అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రమంతా నీటి కోసం అల్లాడుతుంటే, కేసీఆర్ ఫామ్‌హౌస్ మాత్రం నిండుగా కళకళలాడటం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణశాసనం రాసింది ఎవరు
రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ తీవ్రంగా తిప్పికొట్టారు. "ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద దేశాల్లో ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోంది. మరి ఆ వంద దేశాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండటం వల్లే కరవు వచ్చిందా?" అంటూ ఎద్దేవా చేశారు. అసలు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. "2015లోనే కృష్ణా జలాల్లో మనకు 299 టీఎంసీలు సరిపోతాయని సంతకం చేసి, తెలంగాణకు మరణశాసనం రాసింది ఎవరు? పదేళ్ల తమ పాలనలో కృష్ణా బేసిన్లో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? కనీసం ఒక్క ప్రాజెక్ట్ కట్టి ఉన్నా ఈ విపత్కర సమయంలో నీటిని నిల్వ చేసుకునేవాళ్లం కదా!" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడిగడ్డను పూర్తిగా కూల్చాల్సిందే
కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై కేంద్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితి అధ్వానంగా మారిందని, దానిని పూర్తిగా కూల్చేసి మళ్లీ మొదటి నుంచి కొత్తగా నిర్మించాలని నిపుణుల కమిటీ స్పష్టం చేసిందని వెల్లడించారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా ఒక్క చుక్క నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితికి కారణమైన గత పాలకుల పాపం వల్లే నేడు ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


