Godavari Pushkaralu: సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం.పద్మనాభరెడ్డి లేఖ రాశారు. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రభుత్వం సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిసిందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇంత భారీ మొత్తంలో వ్యయం చేయాలన్న ప్రతిపాదనను పునఃపరిశీలించాలని లేఖలో కోరారు.
గత గోదావరి పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్లు, రహదారులు, షెల్టర్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేశారని తెలిపారు. అయితే, పుష్కరాల సమయంలో ఆయా పనులకు ఏర్పడిన వాస్తవ అవసరం, వాటి వినియోగం, వాటిపై చేసిన వ్యయాన్ని సమర్థించే స్థాయిలో లేవని తెలియజేశారు.
కొత్త రహదారుల నిర్మాణం అనవసరం
గత పుష్కరాలు ప్రారంభం కావడానికి కేవలం వారం రోజుల ముందు గోదావరి నది దాదాపు ఎండిపోయి, అక్కడక్కడా కలుషిత నీటి గుంతలు మాత్రమే కనిపించాయని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పుష్కరాలు ప్రారంభమైన సమయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా కడెం ఆనకట్ట నుంచి నీటిని విడుదల చేశారని గుర్తు చేశారు. పుష్కరాలు రెండు నుంచి మూడు వారాల పాటు కొనసాగినందున, అన్ని రహదారులు, స్నాన ఘాట్లపై భక్తుల రాకపోకలు నిరంతరం భారీగా కొనసాగలేదని.. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కొత్త రహదారులు నిర్మించడం అవసరం లేదని తన అభిప్రాయాన్ని తెలియజేశారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి.
ప్రతి నెల అప్పులు చేయాల్సిన పరిస్థితి
పుష్కరాల సమయంలో ప్రభుత్వం ప్రధానంగా శాంతిభద్రతల పరిరక్షణ, తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, షెడ్లు, యాత్రికుల సౌకర్యం, భద్రత కోసం అవసరమైన ఇతర ఏర్పాట్లను కల్పించడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ ఏర్పాట్లను అధిక వ్యయం లేకుండానే చేపట్టవచ్చని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన సాధారణ పరిపాలన, అభివృద్ధి వ్యయాలను నిర్వహించేందుకు ప్రతి నెలా అప్పులు చేయాల్సిన పరిస్థితిలో ఉందన్నారు.
ప్రజాధనం పొదుపుగా వాడుకోవాలి
ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో పుష్కరాలు, జాతరలు, బోనాలు వంటి మతపరమైన, సాంస్కృతిక ఉత్సవాల కోసం భారీ మొత్తాలను ఖర్చు చేయడం అత్యంత సంయమనంతో, వాస్తవంగా అవసరమైన మేరకు మాత్రమే చేపట్టాలన్నారు. అందువల్ల గోదావరి పుష్కరాల కోసం ప్రతిపాదించిన రూ.1,000 కోట్ల వ్యయాన్ని పునఃపరిశీలించి, అత్యవసరమైన అవసర ఆధారిత పనులను మాత్రమే చేపట్టి, ప్రజాధనం వివేకవంతంగా పొదుపుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున పద్మనాభరెడ్డి కోరారు.


