బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బావమరిది, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమీప బంధువైన జోగినపల్లి శ్రీనివాస్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
శ్రీనివాస్ రావు మరణవార్త తెలియగానే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హుటాహుటిన యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. శ్రీనివాస్ రావు పార్థివదేహానికి పూలమాల వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. అనంతరం తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
శ్రీనివాస్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రార్థించారు. మరోవైపు.. జోగినపల్లి శ్రీనివాస్ రావు కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
శ్రీనివాస్ రావు మరణంతో బీఆర్ఎస్ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన కేటీఆర్‌కు స్వయానా మేనమామ కావడంతో.. ఈ విషాద వార్త తెలిసిన వెంటనే కేటీఆర్ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు కూడా తన కార్యక్రమాలను వాయిదా వేసుకుని యశోద ఆస్పత్రికి బయలుదేరారు.
శ్రీనివాస్ రావు మృతికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. శ్రీనివాస్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.


