దేశంలో ఓలా, ఉబర్ వంటి ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న ముందస్తు అదనపు బాదుడుకు కేంద్ర ప్రభుత్వం కట్టడి దిశగా ముకుతాడు వేసింది. క్యాబ్ బుకింగ్ చేసుకునే సమయంలో ప్రయాణానికి ముందే ‘టిప్ ఇస్తారా?’ అని అడిగే ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అన్ని అగ్రిగేటర్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో యాప్‌లను వెంటనే సమీక్షించి, ప్రయాణికులకు కనిపించే ముందస్తు టిప్పింగ్ ఆప్షన్లు, ప్రాంప్ట్‌లను శాశ్వతంగా తొలగించాలని స్పష్టం చేసింది.
ఇటీవలి కాలంలో పలు క్యాబ్ యాప్‌లలో ‘అడ్వాన్స్ టిప్’, ‘చూజ్ యాడ్-ఆన్’, ‘త్వరగా రైడ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాన్ని పెంచుకోండి’ వంటి సందేశాలు వినియోగదారులకు ప్రత్యక్షమవుతున్నాయి. ప్రయాణికులు అదనంగా డబ్బు చెల్లిస్తేనే క్యాబ్ త్వరగా లభిస్తుందని లేదా డ్రైవర్ బుకింగ్‌ను త్వరగా అంగీకరిస్తాడనే తప్పుడు భావనను ఈ యాప్‌లు కలిగిస్తున్నాయని సర్కార్ గుర్తించింది. సాధారణ ప్రయాణ సర్వీసును పొందేందుకు వినియోగదారులు అదనపు భారాన్ని మోయాల్సి రావడం మోటార్ వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది.
2025 మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం.. రైడ్ కన్ఫర్మ్ కావడానికి లేదా సేవా నాణ్యతను పెంచడానికి ముందస్తుగా డబ్బులు వసూలు చేయడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని కేంద్రం హెచ్చరించింది. అదనపు డబ్బులు ఇస్తేనే వేచి ఉండే సమయం తగ్గుతుందనే కృత్రిమ వాతావరణాన్ని డిజిటల్ యాప్‌లలో సృష్టించకూడదని తెలిపింది. గతంలోనే కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (CCPA) ఈ అంశంపై హెచ్చరికలు జారీ చేయగా, తాజాగా రోడ్డు రవాణా శాఖ రంగంలోకి దిగి మరింత కఠినమైన ఆదేశాలను అమలులోకి తెచ్చింది.
అయితే, ప్రయాణం విజయవంతంగా పూర్తయిన తర్వాత డ్రైవర్ సేవలకు మెచ్చి ప్రయాణికుడు తన స్వచ్ఛంద నిర్ణయంతో ఇచ్చే టిప్‌లపై ఎలాంటి నిషేధమూ లేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రయాణికుడు ఆన్‌లైన్ ద్వారా ఇచ్చిన ఆ టిప్ మొత్తం నూటికి నూరు శాతం నేరుగా డ్రైవర్‌కే చెందాలని, అందులో క్యాబ్ యాప్ యాజమాన్యాలు ఎటువంటి కమిషన్ లేదా రుసుములను మినహాయించుకోవడానికి వీల్లేదని ఖరాఖండీగా చెప్పింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామాన్య క్యాబ్ ప్రయాణికుల నుంచి తీవ్ర హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి.


