సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా.. లేక రియలెస్టేట్ ఏజెంటువా?’ అని ప్రశ్నిస్తూ ఆయన సీఎంకు ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ అమ్మకానికి పెట్టడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. నాడు భూములను జాతి సంపదగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి అడ్డగోలుగా వేలానికి పెడుతున్నారని మండిపడ్డారు.
రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 10.63ఎకరాల విలువైన హెరిటేజ్ భూమిని ఈ నెల ఆగస్టు 17, 21తేదీల్లో వేలం వేయడానికి టీజీఐఐసీ(TGIIC) సిద్ధం కావడాన్ని హరీశ్ రావు ఆక్షేపించారు. జీవో నంబర్ 4 ప్రకారం ఈ ప్రాంతం హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడిందని, నిబంధనల ప్రకారం కాపాడాల్సిన భూములను వేలం వేయడం వెనుక రేవంత్ తన అనుయాయులకు మేలు చేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. 2020లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే భూమి పరిరక్షణ కోసం కోర్టుకెళ్లిన రేవంత్ రెడ్డి, నేడు సీఎం అయ్యాక థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతి ఇస్తారని ఆయన నిలదీశారు.
ఈ భూమిపై ఇప్పటికే యజమాన్య వివాదాలు, వక్ఫ్ హక్కుల అంశాలు, అనేక కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హరీశ్ రావు గుర్తుచేశారు. గతంలో ఇదే సర్వే నంబర్లలో 6.2ఎకరాల వేలంపై ఎస్‌బీఐ కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆంక్షలు విధించిందని, వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగానే మళ్లీ మరో 10.63ఎకరాలను వేలానికి పెట్టడం న్యాయ వ్యవస్థను తీవ్రంగా అవమానించడమేనన్నారు. సుమారు రూ.2వేల కోట్ల విలువైన ఈ భూములపై హక్కులు తేలకముందే ప్రభుత్వం అమ్మడానికి ఎందుకు తొందరపడుతోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ‘ఇంచు భూమి కూడా అమ్మం’ అని చెప్పిన రెవెన్యూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు విలువేదీ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. వెంటనే ఆగస్టు 17, 21 తేదీల్లో జరగబోయే టీజీఐఐసీ భూముల వేలాన్ని నిలిపివేయాలని బీఆర్ఎస్ పక్షాన ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 83కి సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, వక్ఫ్, సర్వే రికార్డులను సమగ్రంగా విచారించి వాస్తవాలను బయటపెట్టాలన్నారు. అదేవిధంగా వివాదాస్పదమైన ఈ వేలంలో పాల్గొని భూములు కొనుగోలు చేసే కొనుగోలుదారులు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనక తప్పదని ఆయన స్పష్టమైన హెచ్చరించారు. అనుముల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాదు.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని హరీశ్ రావు హితవు పలికారు.












