తెలంగాణ

తెలంగాణలో 60 లక్షల ఓటర్లకు నోటీసులా? అసలు ఏం జరుగుతోంది..?

రచన: Kashi••7 నిమిషాల పఠనం

తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది సాధారణ ఓటర్ల జాబితా సవరణ కాదు. రాష్ట్రంలోని ఓటర్ల డేటాను భారీ స్థాయిలో తిరిగి పరిశీలించే ప్రక్రియ. ఒకవైపు బోగస్, డూప్లికేట్, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు తొలగించడం అవసరం. మరోవైపు నిజమైన ఓటరు పేరు పొరపాటున జాబితా నుంచి తొలగిపోకుండా చూడటం అంతే ముఖ్యం.

తెలంగాణ‌లో SIR ప్ర‌కంప‌న‌లు

60 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌కు నోటీసులు..!

వివ‌ర‌ణ కోర‌నున్న ఎన్నిక‌ల సంఘం

అస‌లేం జ‌రుగుతోంది..?

తెలంగాణలో ఓటర్ల జాబితా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ.. అంటే SIR లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఓటర్ల వివరాల్లో అనుమానాలు బయటపడుతున్నాయి. తాజాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 60.5 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అంటే.. 60 లక్షల ఓట్లు ఇప్పటికే తొలగించారని కాదు.. వారి వివరాల్లో ఉన్న కొన్ని అంశాలపై వివరణ లేదా ధృవీకరణ అవసరం ఉన్నందున నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్నమాట.

అసలు ఈ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఎందుకు చేపట్టారు? ఓటర్ల జాబితాలో నిజంగా అర్హులైన వారే ఉన్నారా? ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉన్నాయా? చనిపోయిన వారి పేర్లు ఇంకా కొనసాగుతున్నాయా? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శాశ్వతంగా వెళ్లిపోయిన వారి పేర్లు పాత చిరునామాలోనే ఉన్నాయా? వంటి అంశాలను పరిశీలించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించారు.

ఈ పరిశీలనలోనే పెద్ద సంఖ్యలో అన్‌మ్యాప్‌డ్‌ ఓటర్లు కూడా బయటపడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఉన్న ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటర్ల వివరాలను అనుసంధానం చేయడంలో కొన్ని చోట్ల సమస్యలు కనిపిస్తున్నాయి. 2002 నాటి ఓటర్ల జాబితాతో తమ వివరాలను లేదా కుటుంబ సభ్యుల వివరాలను అనుసంధానం చేయలేని వారి విషయంలో కూడా నోటీసులు రావచ్చని అధికారులు చెబుతున్నారు. అంటే ఒక వ్యక్తి పేరు ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉండటం మాత్రమే కాకుండా, అతని వివరాలను పాత రికార్డులతో సరిపోల్చే ప్రక్రియ కూడా జరుగుతోంది.

హైద‌రాబాద్‌లో మ‌రీ దారుణం

ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే సుమారు 12 నుంచి 13 లక్షల మంది ఓటర్లకు నోటీసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలోనే 18.74 లక్షల మంది ఓటర్లు ‘Absent, Shifted or Dead’ కేటగిరీలో ఉన్నట్లు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో గుర్తించారు. ఇది హైదరాబాద్‌లోని మొత్తం ఓటర్లలో దాదాపు 40 శాతానికి సమానం.

అయితే ఇక్కడే రాజకీయంగా అసలు చర్చ మొదలైంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరమే అయినప్పటికీ.. ఇంత భారీ సంఖ్యలో ఓటర్ల వివరాలు అనుమానాస్పదంగా మారడంపై రాజకీయ పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా అర్హులైన ఓటర్ల పేర్లు కూడా పొరపాటున జాబితా నుంచి బయటపడే ప్రమాదం ఉందా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 73 లక్షలకు పైగా అన్‌కలెక్టబుల్‌ ఓటర్ల వివరాలపై కూడా రాజకీయ చర్చ మొదలైంది.

టెన్ష‌న్ ప‌డొద్దు-ఈసీ

మరోవైపు ఎన్నికల అధికారులు మాత్రం ఇది ఓటర్లను తొలగించే ఏకపక్ష ప్రక్రియ కాదని చెబుతున్నారు. అనుమానాలు ఉన్న చోట నోటీసులు ఇచ్చి, సంబంధిత ఓటరు నుంచి వివరణ తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి. అందుకే 60 లక్షల మందికి నోటీసులు అంటే 60 లక్షల ఓట్లు పోయినట్టుగా భావించకూడదు. ఇదే సమయంలో నోటీసు వచ్చిన ఓటర్లు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి అవసరమైన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడం కీలకం.

మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది సాధారణ ఓటర్ల జాబితా సవరణ కాదు. రాష్ట్రంలోని ఓటర్ల డేటాను భారీ స్థాయిలో తిరిగి పరిశీలించే ప్రక్రియ. ఒకవైపు బోగస్, డూప్లికేట్, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు తొలగించడం అవసరం. మరోవైపు నిజమైన ఓటరు పేరు పొరపాటున జాబితా నుంచి తొలగిపోకుండా చూడటం అంతే ముఖ్యం. అందుకే రాబోయే రోజుల్లో వెలువడే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా, దానిపై వచ్చే అభ్యంతరాలు, క్లెయిమ్‌లు.. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది.

ఈ ప్ర‌క్రియ‌లో 60 లక్షల ఓట్లు ఇప్పుడే పోయాయని కాదు. కానీ 60 లక్షల మంది ఓటర్ల వివరాలు మాత్రం ఇప్పుడు అధికారుల పరిశీలనలో ఉన్నాయి. ఐతే వారిలో ఎంతమంది పేర్లు కొనసాగుతాయి? ఎంతమంది పేర్లు పోతాయి? ఎవరి ఓటు మిగులుతుంది? అన్నది తదుపరి ప్రక్రియలో తేలనుంది.

#Telangana Voter List#Telangana SIR#60 Lakh Voters#Voter Notices#Telangana Politics#Election Commission#SIR Telangana#Voter List Revision#Telangana News#Electoral Roll#Hyderabad Voters#Telangana Elections
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి