National

వేదికపై ఉగ్రవాదులతో పాక్ మాజీ మంత్రి.. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

పాకిస్థాన్ మాజీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ సంచలన వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిషేధానికి గురైన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్లతో కలిసి ఆయన ఒకే బహిరంగ సభ వేదికను పంచుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది.

పాకిస్థాన్ మాజీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ సంచలన వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిషేధానికి గురైన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్లతో కలిసి ఆయన ఒకే బహిరంగ సభ వేదికను పంచుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నిషేధిత ఉగ్రవాద ముఠా చీఫ్, ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్‌ను బహిరంగంగానే పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు.

వైరల్ అయిన ఆ వీడియోలో ఎల్‌ఈటీ సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధుతో పాటు సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి రషీద్ ఆ వేదికపై కనిపించారు. అక్కడ హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘నేను హఫీజ్ సాహెబ్‌కు బానిసను’ అంటూ షాకింగ్ ప్రకటన చేశారు. తాము పాకిస్థాన్‌తో పాటు హఫీజ్ సయీద్‌తో కలసి అడుగులు వేస్తున్నామని స్పష్టం చేస్తూ, తనకు ఉగ్రవాద నాయకుడితో ఉన్న సన్నిహిత సంబంధాలను ప్రపంచం ముందే ఒప్పుకున్నారు.

తన ప్రసంగంలో భారత్‌పై విషం చిమ్ముతూ తీవ్రస్థాయి బెదిరింపు వ్యాఖ్యలు గుప్పించారు. భారత్ కనుక పాకిస్థాన్ వైపు కన్నెత్తి చూస్తే ఆ దేశాన్ని దేవుడే నాశనం చేస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో పక్షులు కూడా కూయవని, కనీసం గుళ్లలో గంటలు కూడా మోగవంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు తన మొబైల్‌లో హఫీజ్ సయీద్ ఫోన్ నంబర్ కనిపించినందుకే అక్కడి అధికారులు తనను దేశం నుంచి బహిష్కరించారని ఉగ్ర సంబంధాలను స్వయంగా వెల్లడించారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో 2020 నుంచి 2022 వరకు అత్యంత కీలకమైన అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిగా సేవలు అందించిన వ్యక్తి, ఇలా బహిరంగంగా ఉగ్రవాదులతో జతకట్టడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో దేశ భద్రతను పర్యవేక్షించిన బాధ్యతాయుతమైన నేత, ఇప్పుడు భారత్‌ను నాశనం చేస్తామంటూ బహిరంగ వేదికలపై ఉగ్రవాదులకు మద్దతు పలకడం పాకిస్థాన్ పాలన, ఉగ్రవాద పునాదుల నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టిందని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

#Sheikh Rasheed Ahmed#Hafiz Saeed#Lashkar e Taiba#Pakistan Foreign Relations#Imran Khan Cabinet#Sheikh Rasheed India Comments#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి