దేశంలో విస్తృతంగా విక్రయించే పాన్ మసాలా ప్యాకేజింగ్ విషయంలో కేంద్ర ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాన్ మసాలాలను ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్ లేదా మెటలైజ్డ్ కవర్లలో విక్రయించకూడదని నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా వీటికి బదులుగా కేవలం కాగితం, సెల్యులోజ్, టిన్ లేదా గాజు పాత్రలలో మాత్రమే ప్యాక్ చేయాలని సూచించింది. ఈ ప్రకటనతో పాన్ మసాలాపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేయడంతో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆరోగ్య నిపుణులు, వైద్య వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకింగ్‌ను ప్లాస్టిక్ నుంచి కాగితానికి మార్చడం వల్ల పర్యావరణానికి లబ్ధి చేకూరవచ్చు కానీ, ప్రజారోగ్యానికి జరుగుతున్న ముప్పులో ఎలాంటి మార్పూ ఉండదని వారు తేల్చిచెబుతున్నారు. నోటి క్యాన్సర్‌కు కారణమవుతున్న ప్రాణాంతక పదార్థాన్ని మార్చకుండా, కేవలం దాన్ని చుట్టే ప్యాకెట్‌ను మార్చడం కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదని మండిపడుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్‌సీ), పాన్ మసాలాలో ప్రధానంగా వాడే వక్కను (సుపారీ) అత్యంత ప్రమాదకరమైన 'గ్రూప్ 1' క్యాన్సర్ కారకంగా గుర్తింది. 'పొగాకు రహితం' అని ప్యాకెట్లపై ఆకర్షణీయంగా ముద్రించినప్పటికీ, అందులోని వక్క వల్ల క్రమంగా ‘ఓరల్ సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ వంటి సమస్యలు వచ్చి నోటి కండరాలు గట్టిపడతాయని నిపుణులు వివరిస్తున్నారు. ఇది ముదిరి చివరికి నోటి క్యాన్సర్‌గా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌లో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్ కేసుల్లో దాదాపు 30శాతం ఒక్క నోటి క్యాన్సర్లవే కావడం గమనార్హం. ఏటా దేశంలో సుమారు 1.20లక్షల కొత్త నోటి క్యాన్సర్ కేసులు వెలుగుచూస్తుండగా, దాదాపు 72,000 మంది దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కేవలం వ్యర్థాల నిర్వహణ కోణంలో ప్యాకింగ్ మార్చడంపై మాత్రమే దృష్టి పెట్టకుండా, యువత ఆరోగ్యాన్ని బలితీసుకుంటున్నందున ఈ ప్రాణాంతక ఉత్పత్తులపైనే పూర్తిస్థాయి నిషేధం విధించాలని సామాజిక విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు.












