రాజకీయాలు

Telangana: ఆ పదవి పై రాష్ట్ర కాంగ్రెస్ నిర్లక్ష్యం.. తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందా?

రచన: Venu6 నిమిషాల పఠనం

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రచార కమిటీదే. అలాంటి కీలకమైన బాధ్యతను ఇప్పటి వరకు కొత్త నాయకుడికి అప్పగించకపోవడం కేవలం పరిపాలనా జాప్యమా? లేక పార్టీ అంతర్గత సమీకరణాల ప్రభావమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పార్టీ అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే.. అధికారంలోకి వచ్చాక పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎదగడం ఒక ఎత్తు.. ఇదే అసలైన రాజకీయ నైపుణ్యం అంటారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ తడబడుతుందా? అనే అనుమానాలు పార్టీ వర్గాలలో కలుగుతున్నాయి!.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా... పార్టీకి అత్యంత కీలకమైన ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇప్పటికీ ఖాళీగానే ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రచార కమిటీదే. అలాంటి కీలకమైన బాధ్యతను ఇప్పటి వరకు కొత్త నాయకుడికి అప్పగించకపోవడం కేవలం పరిపాలనా జాప్యమా? లేక పార్టీ అంతర్గత సమీకరణాల ప్రభావమా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు రాజకీయాల్లో పదవులు అంటే కేవలం హోదాలు కావు... అవి సిసలైన నాయకత్వానికి బలమైన పునాదులు..

ఎవరిని ముందుకు తీసుకురావాలి? ఎవరికి బాధ్యత ఇవ్వాలి? అనే ప్రతి నిర్ణయం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే కాంగ్రెస్‌లో ప్రచార కమిటీ చైర్మన్ ఎంపిక ఇంతకాలం పెండింగ్‌లో ఉండటం కార్యకర్తల్లో కూడా అసంతృప్తిని పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు సహా పలు కీలక నియామకాలు కూడా ఆలస్యమవుతుండటంతో... నిర్ణయాలు తీసుకునే వేగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అధికారంలో ఉన్న పార్టీగా మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన సమయంలో... ఈ ఆలస్యం ప్రతిపక్షాలకు అవకాశంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కమిటీ చైర్మన్ రేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరు చాలాకాలంగా వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కోసం పనిచేసిన అనుభవం, ప్రజల్లో గుర్తింపు, మీడియాతో సమర్థవంతమైన కమ్యూనికేషన్... ఇవన్నీ ఆయనకు బలాలుగా చెబుతున్నారు.

కానీ ప్రకటన పదేపదే వాయిదా పడుతుండటంతో పరిస్థితులు మారిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల నవంబర్‌లో తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలతో... ఆయన రాజకీయ భవిష్యత్తుపై కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఆ పదవి ఆఫర్ చేస్తే ఆయన అంగీకరిస్తారా? లేక ఇప్పటికే తన రాజకీయ దిశను మార్చుకున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది.

ఒకవేళ జగ్గారెడ్డి నిరాకరిస్తే... తర్వాత ప్రత్యామ్నాయం ఎవరు? రాష్ట్రవ్యాప్తంగా పార్టీని సమన్వయం చేయగల నాయకుడు ఎవరున్నారు? అన్ని వర్గాలతో సమానంగా పని చేయగల సామర్థ్యం ఎవరికుంది? అనే ప్రశ్నలకు కూడా కాంగ్రెస్ నాయకత్వం సమాధానం వెతుకుతున్నట్టే కనిపిస్తోంది. రాజకీయాల్లో సమయం చాలా విలువైనది. సరైన సమయంలో తీసుకోని నిర్ణయం వల్ల ఎంత నష్టం జరుగుతుందో.. తర్వాత ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా ఫలితం ఉండదు..

అందుకే ప్రచార కమిటీ చైర్మన్ నియామకం ఇప్పుడు ఒక పదవి భర్తీ మాత్రమే కాదు... తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయ సామర్థ్యానికి, అంతర్గత ఐక్యతకు, భవిష్యత్ రాజకీయ వ్యూహానికి పరీక్షగా మారింది. మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఈ సస్పెన్స్‌కు త్వరలో తెరదించుతుందా? జగ్గారెడ్డికే బాధ్యతలు అప్పగిస్తుందా? లేక కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకువస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ దిశను ప్రభావితం చేసే ఈ అంశం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి!..

#Telangana#congress#cm Revanth reddy#negligence#Campaign Committee Chairman#post
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి