రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందా? ఈసారైనా తమకు అవకాశం ఇవ్వాలని అధికార పార్టీలోని సీనియర్లు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తుంటే మరికొందరు సీనియర్ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో తమకు హామీ ఇచ్చారని కొందరు.. సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే తమకే ప్రాధాన్యత ఇవ్వాలని మరికొందరు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. అసలు మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోదని, హైమాండ్ నుంచి విస్తరణకు సంబంధించి ఎలాంటి కదలిక లేదని ప్రచారం జరుగుతోంది. కేబినెట్ విస్తరణ అంశం ఇక అటకెక్కినట్టేనని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త మంత్రుల అవసరం లేదనే వాదన వినిపిస్తోంది తెరమీదికి వచ్చింది.
పాలన అంత సవ్యంగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ ఎందుకు? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఇద్దరు లీడర్లు సచివాలయంలో కనిపించపించగా కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందని ఆరా తీయగా ‘కేబినెట్ విస్తరణ ఎందుకు? ఈ టర్మ్‌లో అసలు విస్తరణనే ఉండకపోవచ్చు’వారు అన్నట్టు సమాచారం.
ప్రస్తుతం సీఎంతో కలుపుకుని మొత్తం 16 మంది మంత్రులు ఉన్నారు. మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు హైకమాండ్ వద్ద తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందరి అభిప్రాయాలు తీసుకుంటున్న ఢిల్లీ నేతలు ఇప్పటివరకు విస్తరణ ముహుర్తాన్ని ఫిక్స్ చేయలేదు.ఈ క్రమంలోనే సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఇద్దరు లీడర్లు కేబినెట్ విస్తరణపై అసలు విషయాన్ని తేల్చడంతో చాలా మంది నిరాశలో ఉన్నట్టు తెలిసింది. ఈ టర్ములో కేబినెట్ విస్తరణ లేకపోతే తర్వాత టర్ములో అయినా ఉంటుందా? లేదా? అనేదానిపైనా క్లారిటీ లేకపోవడంతో నేతలు ఆందోళనలో ఉన్నట్టు సమాచారం.












