డబుల్ బెడ్రూమ్ కేటాయింపుల పేరుతో నకిలీ ఉత్తర్వులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 52 నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ (జూబ్లీహిల్స్ జోన్) బృందం, మొఘల్‌పురా పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ స్కామ్ గుట్టురట్టు చేశారు.
ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్లు కేటాయిస్తామని నమ్మించి, నకిలీ కేటాయింపు ఉత్తర్వులు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న సయ్యద్ సల్మాన్ (27)ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 52 నకిలీ/ఫోర్జరీ పత్రాలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో నిందితుడు కలెక్టరేట్ అధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయని నమ్మించి, 2BHK ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి బాధితుల నుంచి డబ్బులు, ఆధార్ కార్డు జిరాక్స్‌లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు సేకరించినట్లు తేల్చారు. అనంతరం ప్రభుత్వ ముద్రలతో కూడిన నకిలీ కేటాయింపు ఉత్తర్వులు తయారు చేసి అందజేసి, 50 మందికి పైగా అమాయకులను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు.
https://x.com/hydcitypolice/status/2083648867082592461?s=20
ఈ ఆపరేషన్‌ను జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. యాదేందర్, సబ్-ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ జాహిద్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, మొఘల్‌పురా పోలీసుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించగా.. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.












