హైదరాబాద్ మహానగరంలో సొంతిల్లే కదా అని ధీమాగా ఉన్నారా? దశాబ్దాలుగా ఆస్తిపన్ను కడుతున్నాం, జీహెచ్‌ఎంసీ అనుమతులతోనే ఇల్లు కట్టాం, ఇక మా ఆస్తికి ఎలాంటి ఢోకా లేదనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే మేల్కోవాల్సిందే! గ్రేటర్ పరిధిలోని వేలాది మంది ఇళ్ల యజమానులకు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం కో-ఆపరేటివ్ సొసైటీల్లో ఓపెన్ ప్లాట్లు కొని, కష్టపడి కట్టుకున్న ఇళ్లు సైతం రాత్రికి రాత్రే నిషేధిత జాబితా (22A)లోకి చేరిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే తప్ప తమ ఆస్తి ప్రభుత్వం ఖాతాలో పడిపోయిందనే చేదు నిజం బాధితులకు తెలియడం లేదు.
ఆలస్యంగా వెలుగులోకి..
అసలు వివాదం ఆరు నెలల క్రితమే మొదలైనా, ఇటీవల కాలంలోనే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య సమన్వయ లోపం, రికార్డుల డిజిటలైజేషన్ పేరిట చేసిన తప్పిదాల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. పాత రికార్డులను సరిగ్గా పరిశీలించకుండా, ప్రభుత్వ భూముల సర్వే నంబర్ల సరిహద్దుల్లో ఉన్న ప్రైవేటు ఆస్తులను కూడా పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చేశారు. దీంతో ఏళ్ల తరబడి హక్కు కలిగి ఉన్న ప్లాట్లు, ఇళ్లు ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లకు దూరమైపోయాయి.
నిషేధిత జాబితాలోకి ఆస్తులు.. నిలిచిపోతున్న రిజిస్ట్రేషన్లు
ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తీవ్రంగా నిలిచిపోయింది. అత్యవసరాల నిమిత్తం, పిల్లల చదువులు లేదా వివాహాల కోసం ఆస్తులను విక్రయించుకుందామని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్తున్న వారికి సబ్ రిజిస్ట్రార్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. "మీ స్థలం నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ చేయడం వీలుపడదు" అని చెప్తుండటంతో ఇంటి ఓనర్ల గుండెలు గుబేలుమంటున్నాయి. ఒక్కసారిగా నిషేధితా జాబితాలో ఉందంటూ అధికారులు చేతులెత్తేస్తుండటంతో కొనుగోలుదారులు, అమ్మకందారులు లబోదిబోమంటున్నారు. తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న ఆస్తులు ఒక్కసారిగా నిషేధిత జాబితాలోకి ఎలా వెళ్లాయో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
ఈ నిర్వాకంతో బాధితులు తమ రోజూవారీ పనులను వదిలేసి కలెక్టరేట్‌లు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గ్రీవెన్స్ సెల్లలో వినతిపత్రాలు ఇస్తూ, దరఖాస్తులు చేసుకుంటూ అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. కలెక్టర్ కార్యాలయాల వద్ద నిత్యం పౌరుల క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఒక చిన్న ప్రభుత్వ పొరపాటు కారణంగా సామాన్యులు తమ సొంత ఆస్తిని నిరూపించుకోవడానికి ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతూ ఆర్థికంగా, మానసికంగా తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్నారు.
నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్
ఈ సమస్య తీవ్రతను గుర్తించి ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను పునఃపరిశీలించాల్సిన అవసరముంది. ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా జీహెచ్‌ఎంసీ పన్నులు చెల్లిస్తున్న రికార్డులు, పాత రిజిస్ట్రేషన్ పత్రాలను పరిగణనలోకి తీసుకుని, పొరపాటున 22A జాబితాలో చేర్చిన ప్రైవేటు ఆస్తులను వెంటనే తొలగించాలి. అన్యంపుణ్యం ఎరుగని తమను ఈ మానసిక వేదన నుంచి గట్టెక్కించేలా పారదర్శకమైన చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
టాప్ న్యూస్
సొంతిల్లే కదా అని ధీమాగా ఉన్నారా? హైదరాబాద్‌లో 'నిషేధిత' ముప్పు.. మీ ఆస్తి మీదేనా, ఒకసారి చెక్ చేసుకోండి!
రచన: Mamatha puppala••6 నిమిషాల పఠనం
హైదరాబాద్ మహానగరంలో సొంతిల్లే కదా అని ధీమాగా ఉన్నారా? దశాబ్దాలుగా ఆస్తిపన్ను కడుతున్నాం, జీహెచ్‌ఎంసీ అనుమతులతోనే ఇల్లు కట్టాం, ఇక మా ఆస్తికి ఎలాంటి ఢోకా లేదనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే మేల్కోవాల్సిందే! గ్రేటర్ పరిధిలోని వేలాది మంది ఇళ్ల యజమానులకు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి.
#Hyderabad Property#22A List#Prohibited Properties#GHMC#Property Registration#Telangana News#Hyderabad Real Estate#Revenue Department#Sub Registrar#Property Verification#Swechaanews












