తెలంగాణ

Telangana: టీపీసీసీలో భారీ మార్పులకు రంగం సిద్ధం.. ఆగస్టులో కీలక నియామకాలు!

రచన: Venu6 నిమిషాల పఠనం

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ముందుగా పార్టీ సంస్థాగత పదవులను భర్తీ చేసి, ఆ తర్వాతే ప్రభుత్వ పదవుల నియామకాలకు వెళ్లాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల భర్తీ ప్రక్రియపై హైకమాండ్ దృష్టి సారించినట్లు సమాచారం. తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ముందుగా పార్టీ సంస్థాగత పదవులను భర్తీ చేసి, ఆ తర్వాతే ప్రభుత్వ పదవుల నియామకాలకు వెళ్లాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ, ఇప్పటివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం జరగలేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ఈ నియామకాలు కీలకంగా భావిస్తున్నారు.

మొత్తం నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి, ఎస్సీ మాదిగ, ఎస్టీ లంబాడా, మైనారిటీ వర్గాలకు ఒక్కో స్థానం కేటాయించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఎస్టీ కోటాలో మాజీ ఎమ్మెల్యే బెల్లయ్య నాయక్ పేరు వినిపిస్తుండగా, మైనారిటీ కోటాలో ఒబేదుల్లా కొత్వాల్, అజ్మతుల్లా పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పేరుపై సమన్వయ కమిటీలో ఏకాభిప్రాయం ఏర్పడినట్లు సమాచారం. మీడియా కమిటీ చైర్మన్‌గా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ జస్టిస్ సహా మరికొన్ని కీలక కమిటీలను కూడా ఒకేసారి ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మీడియా కమిటీ చైర్మన్‌గా ఉన్న సామా రామ్మోహన్ రెడ్డిని హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి ప్రత్యేక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు వంటి పెండింగ్ పదవులను కూడా భర్తీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. పనితీరు ఆశించిన స్థాయిలో లేని రెండు నుంచి మూడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను మార్చే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఈ మొత్తం పక్రియను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. దశలవారీగా అన్ని పార్టీ పదవులను ప్రకటిస్తూ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పార్టీ పదవుల భర్తీ పూర్తయిన వెంటనే ప్రభుత్వ పదవుల భర్తీపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

తొలి విడతలో సుమారు 20 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. వీటిలో 7 నుంచి 9 కార్పొరేషన్లకు ఇటీవల పదవీకాలం ముగిసిన చైర్మన్లనే తిరిగి నియమించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ముందుగా పూర్తి చేసి, అనంతరం కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ పదవులను భర్తీ చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

#Telangana#congress#TPCC#changes#August
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి