తెలంగాణ

Telangana: భద్రాచలం ప్రజలకు హై అలర్ట్.. నేడు మూడు జిల్లాల్లో మంత్రుల పర్యటన!..

రచన: Venu4 నిమిషాల పఠనం

భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తలమడుగు మండలంతో పాటు రుయ్యాడ, కప్పర్‌దేవి గ్రామాల్లో పత్తి పొలాలు వరద నీటితో మునిగిపోయాయి.

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. గోదావరి పరీవాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రజాప్రతినిధులను కూడా సహాయక చర్యల్లో భాగస్వాములను చేయాలని ఆదేశించారు.

పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, విద్యుత్, వైద్యసేవలు, పారిశుద్ధ్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా, వరద పరిస్థితులపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత వేగవంతం చేసింది. శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలోని పార్వతి పంప్‌హౌస్‌ను సందర్శించి నీటి ప్రవాహం, ప్రాజెక్టుల పరిస్థితిని సమీక్షించనున్నారు.

మరోవైపు, భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వర్షాలతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తలమడుగు మండలంతో పాటు రుయ్యాడ, కప్పర్‌దేవి గ్రామాల్లో పత్తి పొలాలు వరద నీటితో మునిగిపోయాయి. పంటలపై ఇసుక మేటలు పేరుకుపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పది రోజుల క్రితం వరకు పచ్చగా కళకళలాడిన పొలాలు ఇప్పుడు బీడుగా మారాయి. వర్షాభావాన్ని ఎదుర్కొంటూ అందుబాటులో ఉన్న నీటి వనరులతో ఎంతో కష్టపడి పంటలను కాపాడుకున్న రైతులకు ఈ వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి..

ఇక జిల్లా వ్యాప్తంగా సుమారు 4,634 ఎకరాల్లో పంట నష్టం నమోదవగా, అత్యధికంగా తలమడుగు మండలంలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకవైపు గోదావరి వరదలు ప్రజలను అప్రమత్తం చేస్తుంటే, మరోవైపు రైతుల పంట నష్టం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం సహాయక చర్యలను మరింత వేగవంతం చేసి, బాధితులకు తక్షణ సాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు.

#Telangana#Bhadrachalam#Rains#floods#Uttam Kumar Reddy#Sridhar Babu#visit#three districts#today
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి