గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఇక్కడి ప్రజల సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక బలమైన సమాధానమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎర్ర బస్సు కూడా సరిగా రాదని, అలాంటి చోట భారీ ఎయిర్‌పోర్టు అవసరమా? అని ఎగతాళి చేసిన నాయకులకు ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవమే దిమ్మతిరిగే జవాబు అని పేర్కొన్నారు.
"ఎర్ర బస్సు రాదన్న చోటే ఎయిర్‌పోర్టు వచ్చింది, మన ప్రధాని మోదీ స్వయంగా వచ్చి ప్రారంభించారు.. ఇదీ మన ఉత్తరాంధ్ర దెబ్బ! అర్థమైందా రాజా!" అంటూ విపక్షాలను ఉద్దేశించి తనదైన శైలిలో చురకలంటించారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ నాయకత్వంలో రెక్కలు తొడిగారని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ సహకారం మోదీ అందిస్తున్న మద్దతుతోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా 'నమో' (NAMO) అనే పదానికి ప్రత్యేక నిర్వచనం చెప్తూ.. నమో అంటే 'హిమ్మత్' (ధైర్యం), 'విశ్వాస్' (నమ్మకం), 'సురక్షిత్ భారత్' (సురక్షిత భారతం) అని అభివర్ణించారు. ఏపీ ప్రగతి పథంలో ప్రధాని అడుగులు ఎంతో కీలకమని కొనియాడారు. అపారమైన సహజ వనరులు, సుదీర్ఘ సముద్ర తీరం కలిగిన ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చడంలో ఈ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, పర్యాటకాన్ని పెంచడంలోనూ ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక విప్లవాత్మకమైన "పవర్ ఇంజిన్" లాగా పనిచేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రికార్డు స్థాయిలో విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చిన జీఎంఆర్ (GMR) సంస్థ యాజమాన్యానికి, ప్రతినిధులకు లోకేశ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విశాఖతో పాటు చుట్టుపక్కల జిల్లాల వ్యాపార, పారిశ్రామిక రంగానికి ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు సరికొత్త మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన వారికి ప్రధాని చేతుల మీదుగా జరిగిన ఈ ప్రారంభోత్సవమే సరైన సమాధానమని పునరుద్ఘాటించారు. ప్రత్యర్థులను ఉద్దేశించి లోకేశ్ చేసిన "అర్థమైందా రాజా" సెటైర్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.












