ఇప్పుడు ప్రతి ఇంట్లో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు నిత్యావసరాలుగా మారిపోయాయి. కానీ ఒక్కసారి వీటిలో ఏదైనా పాడైతే.. మరమ్మతుల ఖర్చు మాత్రం వేల నుంచి లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి ఆర్థిక భారాన్ని తగ్గించే మార్గమే గృహోపకరణాల బీమా.
చాలా బీమా సంస్థలు ఇంట్లోని ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులకు ప్రత్యేక ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఒకే పాలసీలో అన్ని గృహోపకరణాలకు రక్షణ కల్పిస్తే.. మరికొన్ని సంస్థలు ఒక్కో వస్తువుకు విడిగా పాలసీలు ఇస్తున్నాయి. అయితే వస్తువు విలువను బట్టి సంవత్సరానికి వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ప్రీమియం ఉండొచ్చు.
ఇక ఈ బీమా తీసుకునే ముందు కొనుగోలు బిల్లు, బ్రాండ్ పేరు, మోడల్ నంబర్, సీరియల్ నంబర్ వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. సాధారణంగా ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఎయిర్ కండీషనర్, మైక్రోవేవ్ ఓవెన్, డిష్‌వాషర్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, హోమ్ థియేటర్, ఇన్వర్టర్, యూపీఎస్, సోలార్ పరికరాలు, అలాగే ఖరీదైన కిచెన్ ఉపకరణాలకు కూడా బీమా అందుబాటులో ఉంది.
ఒకవేళ వస్తువు దెబ్బతింటే.. వెంటనే బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాలి. నష్టం జరిగిన ఫొటోలు, వీడియోలు భద్రపరచాలి. కొనుగోలు బిల్లు, వారంటీ కార్డు సిద్ధంగా ఉంచాలి. క్లెయిమ్ నంబర్ తీసుకుని, కంపెనీ సూచించిన అధికారిక సర్వీస్ సెంటర్‌లోనే మరమ్మతులు చేయించాలి. చేసిన ఖర్చుకు సంబంధించిన అన్ని రసీదులను తప్పనిసరిగా భద్రపరచాలి.
అలాగే బీమా కంపెనీని ఎంపిక చేసేటప్పుడు క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో, క్యాష్‌లెస్ రిపేర్ సౌకర్యం, ఆన్‌లైన్ క్లెయిమ్ విధానం, నెట్‌వర్క్ సర్వీస్ సెంటర్ల సంఖ్య, 24 గంటల కస్టమర్ సపోర్ట్, అలాగే కస్టమర్ రివ్యూలను పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే కొనుగోలు బిల్లును పోగొట్టుకోవడం, పాలసీ నిబంధనలు చదవకుండా తీసుకోవడం, ఆలస్యంగా క్లెయిమ్ చేయడం, అనధికారిక సర్వీస్ సెంటర్‌లో రిపేర్ చేయించడం, పాలసీలో లేని నష్టాలకు క్లెయిమ్ చేయడం వంటివి పరిహారం తిరస్కరణకు కారణం కావచ్చు కాబట్టి ఈ పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి.
ఈ బీమా ద్వారా అగ్నిప్రమాదం, షార్ట్ సర్క్యూట్, విద్యుత్ వోల్టేజ్ హెచ్చుతగ్గులు, పిడుగు ప్రభావం, వరదలు, తుపాన్లు వంటి అనేక ప్రమాదాల వల్ల కలిగే నష్టాలకు రక్షణ లభించే అవకాశం ఉంటుంది.
అయితే ఏ నష్టాలు కవర్ అవుతాయి? గరిష్ఠంగా ఎంత పరిహారం లభిస్తుంది? డిప్రిసియేషన్ ఎలా లెక్కిస్తారు? క్యాష్‌లెస్ రిపేర్ ఉందా? ప్రీమియం ఎంత? వంటి వివరాలను ముందుగానే తెలుసుకుంటే మంచింది.
అలాగే ఇంటికి హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో గృహోపకరణాలు కూడా కవర్ అయ్యేలా పాలసీని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వారంటీ ముగిసిన తర్వాత ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇన్సూరెన్స్ రెండూ ఒకటే కాదని గుర్తుంచుకోవాలి.
వారంటీ సాధారణంగా తయారీ లోపాలు, కొన్ని మెకానికల్ సమస్యలకే పరిమితం అవుతుంది. కానీ ఇన్సూరెన్స్ మాత్రం అగ్నిప్రమాదం, విద్యుత్ హెచ్చుతగ్గులు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అనేక అనుకోని ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణను అందిస్తుంది.
ఇలా చిన్న ప్రీమియంతో పెద్ద నష్టాల నుంచి మీ ఇంట్లోని విలువైన గృహోపకరణాలను కాపాడుకోవచ్చు. కాబట్టి అవసరానికి తగ్గ పాలసీని ఎంచుకుని ముందుగానే భద్రతను సొంతం చేసుకోవడం తెలివైన నిర్ణయం అని నిపుణులు అంటున్నారు..












