ఏపీ

AP: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ!

రచన: Mamatha puppala6 నిమిషాల పఠనం

ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునికంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.

 ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునికంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కీలక ఘట్టంలో రాష్ట్ర గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, సదుపాయాలను పరిశీలించారు. టెర్మినల్ భవనంలో కలియతిరిగి, అక్కడ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధాని వెంట ఉండి, విమానాశ్రయ ప్రాంగణంలోని విశేషాలను, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులను ఆయనకు వివరించారు.

ప్రపంచ స్థాయిలో భారీ ప్రాజెక్టు.. 5లక్షల ఉద్యోగావకాశాలు

రూ.4,750 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల్లో నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ స్థాయి వసతులతో రూపుదిద్దుకుంది. ఎయిర్‌బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు ల్యాండయ్యేలా 3.8 కి.మీ. పొడవున రెండు రన్‌వేలు, 79 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు అంతస్తుల టెర్మినల్ భవనం, 55 మీటర్ల ఎత్తులో ఏటీసీ టవర్ మరియు 25 ఎకరాల్లో విమానాల మరమ్మతుల (MRO) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంవత్సరానికి 25 వేల టన్నుల సరకు రవాణా సామర్థ్యం ఉన్న కార్గో టెర్మినల్, జీఎంఆర్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఏరో సిటీ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మందికి, పరోక్షంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 5.85 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. తొలిదశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా, గంటకు 275 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలులను సైతం తట్టుకునేలా దీనిని నిర్మించారు.

తెలుగు సంస్కృతి, కళాకృతుల కలబోత

సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో ఈ విమానాశ్రయాన్ని 'ఎగిరే చేప' ఆకృతిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. జీఎంఆర్ సంస్థ ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని అలంకరించింది. స్వాగత ద్వారం వద్ద భారీ ఏటికొప్పాక బొమ్మ, లోపల సీలింగ్‌పై ముగ్గులు, నాదస్వరం థీమ్‌లతో పాటు తోలుబొమ్మలాట, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడి చిత్రాలను పొందుపరిచారు. అంతేకాక విజయనగరం కోట, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, కనకమహాలక్ష్మి దేవాలయాలు, తప్పెటగుళ్లు మరియు థింసా నృత్య కళారూపాలు టెర్మినల్ గోడలపై ఉత్తరాంధ్ర చారిత్రక వైభవాన్ని చాటిచెబుతున్నాయి.

13,750 మంది కళాకారులతో ఘన స్వాగతం

విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా 13,750 మందితో బృహత్తర 'థింసా' నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. టెర్మినల్ భవనం నుంచి బహిరంగ సభా వేదిక వరకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన భారీ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ ఓపెన్ టాప్ జీపులో వెళ్తుండగా కళాకారులు ఈ సాంప్రదాయ నృత్యంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

#Bhogapuram International Airport#PM Narendra Modi Bhogapuram#Alluri Sitarama Raju Airport#Chandrababu Naidu Pawan Kalyan#GMR Bhogapuram Airport Terminal#North Andhra Infrastructure Development#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి