ఏపీ

'భోగాపురం భోగం ఎవరిది?': మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్‌పై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయం వేడెక్కిన వేళ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్‌పై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయం వేడెక్కిన వేళ, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ప్రాజెక్టు క్రెడిట్ టీడీపీకి గానీ, వైసీపీకి గానీ దక్కదని, అసలు భోగం మొత్తం జీఎంఆర్ (GMR) సంస్థదేనని ఆయన స్పష్టం చేశారు. "కొట్టుకోవడం ఆపండి.. ఆ క్రెడిట్ జీఎంఆర్ సంస్థది" అంటూ సోషల్ మీడియాలో ఆయన పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రాజెక్టు పరిణామాలను వరుసగా వివరిస్తూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు కోసం అవసరానికి మించి 5,000 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం, నిర్వాసితుల ఆందోళనకు నాటి ప్రతిపక్షం మద్దతు తెలపడం వాస్తవమని గుర్తుచేశారు. ఆ తర్వాత భూమిని 3,000 ఎకరాలకు తగ్గించారని తెలిపారు. తొలుత నిర్వహించిన టెండర్లలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) బిడ్ గెలుచుకున్నప్పటికీ, జీఎంఆర్ కోసం ఆ వేలాన్ని రద్దు చేశారని, అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుని బలవంతంగా ఒప్పించి, నిబంధనలు సవరించి ప్రాజెక్టును జీఎంఆర్‌కే కట్టబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.

తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొదట్లో పనులను నిలిపివేసిందని, అయితే కాకినాడ సెజ్‌లో జీఎంఆర్ వాటాలను అరబిందో సంస్థకు బదలాయించే ఒప్పందం కుదిరాకే 2023లో పనులకు అనుమతులిచ్చారని వివరించారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనులను వేగవంతం చేశారని, కనెక్టింగ్ రోడ్లు, ఇతర వసతుల కోసం పేద రాష్ట్రమైన ఏపీ ప్రజల సొమ్ము కోట్లలో ఖర్చు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఓ బట్టల షాపింగ్ మాల్ ప్రారంభించినట్లు ప్రభుత్వం హడావుడి చేయడం, మీడియా అతి ప్రచారం చేయడంపై ఆయన తీవ్రంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఒకవైపు భోగాపురంపై ఇంత ప్రచారం జరుగుతున్నా, విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధిని గాలికి వదిలేయడం, నేటికీ ఒక్క అంతర్జాతీయ సర్వీసు కూడా తీసుకురాలేకపోవడం చేదు నిజమని ఎండగట్టారు. "వాట్సాప్ యుగంలో ప్రజల జ్ఞాపకశక్తి చాలా తక్కువని అందరి భావన. అందుకే ఈ పరిణామాలన్నీ ఒక క్రమంలో గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మీరే తేల్చుకోండి.. భోగాపురం భోగం ఎవరిదో, అసలు క్రెడిట్ ఎవరిదో?" అంటూ ఏబీవీ తన పోస్టును ముగించారు.

https://x.com/abvrao/status/2083050556990554391?s=20

 

#Bhogapuram Airport Credit Controversy#AB Venkateswara Rao IPS Post#GMR Bhogapuram Airport Project#ABV Sensational Comments Bhogapuram#TDP YCP Bhogapuram Credit War#Vijayawada Airport Development Issues
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి