ఏపీలో విశాఖ నుంచి తిరుపతి దాకా 7 ఎయిర్‌పోర్టులు
తెలంగాణలో శంషాబాద్ ఒక్కటే
తెలుగు రాష్ట్రాల్లో ఎందుకీ తేడా..?
భౌగోళిక పరిస్థితులా.. రాజకీయ కారణాలా..?
భోగాపురం ప్రారంభం వేళ ఆసక్తికర విశ్లేషణ
త్వరలో వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి...
విశాఖ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గేట్‌వేగా నిలవనుంది. తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులే లక్ష్యంగా మొదలైన ఈ ఎయిర్‌పోర్టు భవిష్యత్‌లో 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా విస్తరించనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఇది ఓ భారీ ప్రాజెక్టనే చెప్పుకోవచ్చు. అందుకే కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇదే సమయంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఏపీలో ఇప్పుడు ఏకంగా 7 విమానాశ్రయాలు ఉండగా.. తెలంగాణలో మాత్రం ఒక్కటే ప్రధాన కమర్షియల్ ఎయిర్‌పోర్టు ఎందుకు ఉంది? ఇది కేవలం భౌగోళిక పరిస్థితుల ప్రభావమా? లేక రాజకీయ నిర్ణయాల ఫలితమా?
రాష్ట్ర విభజన తర్వాత మారిన సీన్
2014లో రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణకు వచ్చింది. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోవడం పెద్ద లోటుగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఒక్క నగరంపై ఆధారపడకుండా రాష్ట్రవ్యాప్తంగా విమాన కనెక్టివిటీ పెంచే దిశగా అడుగులు వేసింది. అప్పటికే ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప, కర్నూలు (ఓర్వకల్), పుట్టపర్తి ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఎయిర్‌పోర్టులు ఇప్పుడు రెగ్యులర్ సేవలందించడం లేదు. ప్రస్తుతం భోగాపురం అందుబాటులోకి రావడంతో.. త్వరలోనే విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు నిలిచిపోనున్నాయి.
తెలంగాణలో ఒక్కటే ఎందుకు?
తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన కమర్షియల్ ఎయిర్‌పోర్టు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే. దీనికి ప్రధాన కారణం ఎయిర్‌పోర్టు కన్సెషన్ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ విమానాశ్రయం చుట్టూ సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో మరో కొత్త కమర్షియల్ ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇవ్వాలంటే ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. అందుకే వరంగల్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనలు వచ్చినా అవి ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు.
తెలంగాణలో దాదాపు మొత్తం పెట్టుబడులు, ఐటీ, అంతర్జాతీయ వ్యాపారం హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. దీంతో ప్రభుత్వాలు కూడా కొత్త విమానాశ్రయాల కంటే ఇప్పటికే ఉన్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టును మరింత విస్తరించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాయి. తెలంగాణలో ఒకే భారీ హబ్ మోడల్‌కు ప్రాధాన్యం లభించగా, ఆంధ్రప్రదేశ్‌లో బహుళ ప్రాంతీయ ఎయిర్‌పోర్టులు అనే మోడల్ అమలవుతోంది.
ఏపీకి 7 ఎయిర్‌పోర్టులు ఉన్నాయంటే లాభమేనా?
సంఖ్య ఎక్కువగా ఉండటం మాత్రమే విజయానికి కొలమానం కాదు. ఒక ఎయిర్‌పోర్టు విజయవంతం కావాలంటే.. రోజువారీ విమాన సర్వీసులు, ప్రయాణికుల సంఖ్య, కార్గో రవాణా, పారిశ్రామిక పెట్టుబడులు, పర్యాటక అభివృద్ధి.. సమానంగా పెరగాలి. ఇప్పటికీ ఏపీలో కొన్ని చిన్న ఎయిర్‌పోర్టుల్లో పరిమిత విమాన సర్వీసులే ఉన్నాయి. అంటే నిర్మించడం ఒక దశ అయితే... వాటిని ఆర్థికంగా నిలబెట్టడం మరో పెద్ద సవాల్.
త్వరలో వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత ఆలోచనలో పడింది. భౌగోళికంగా హైదరాబాద్ నగరం.. రాష్ట్రం మధ్యలో ఉన్నా.. కొన్ని సుదూర ప్రాంతాలకు వెళ్లి, రావడం కష్టంగానే ఉంది. అందుకే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. ఈ రెండు ఎయిర్‌పోర్టులను 2028 జూన్ 2.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
వరంగల్ విమానాశ్రయానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు మంజూరు చేసింది. రూ. 496.86 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించింది. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ సివిల్ ఎన్‌క్లేవ్, రన్‌వే విస్తరణ, భూసేకరణ పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 36 ద్వారా రూ. 2,278 కోట్లు మంజూరు చేసింది. రక్షణ శాఖ వాటాతో కలిపి ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు రూ. 5,500 కోట్లుగా ఉండనుంది. ఈ రెండూ అందుబాటులోకి వస్తే తెలంగాణలో కూడా ఎయిర్‌పోర్టుల సంఖ్య మూడుకు చేరుకుంటుంది.












