తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రానికి జలకళ వచ్చేసింది. డ్యామ్ లన్ని నిండుకుండలా మారాయి.. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతున్న కారణంగా భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకోవటంతో అధికారులు మూడవ ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు.
కాగా నిన్న రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే.. ఇక శనివారం ఉదయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం55.1 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
మరోవైపు వరద నీటిమట్టం పెరగటంతో దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద స్నానఘట్టాలు మునిగాయి. సీతవాగు వద్ద సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జి నీటమునిగి పోయాయి. తూరుబాక ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారిపై ఇటీవల నిర్మించిన హైలెవల్ వంతెన ఇరువైపులా అప్రోచ్‌లు కోతకు గురై ప్రమాదకరంగా మారింది..
ఇక చర్ల మండలంలోని వీరాపురం శివారు ఇసుక క్వారీలో, ఎగువ నుంచి వచ్చిన వరద కారణంగా దాదాపు 44 మంది లారీ డ్రైవర్లతో పాటు స్థానికులు చిక్కుకుపోగా.. తక్షణమే స్పందించిన అధికారులు వీరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 30కు పైగా లారీలు క్వారీలోనే ఉన్నట్టు సమాచారం. అలాగే అశ్వాపురం మండలంలోని బట్టీలగుంపు-రామ్‌నగర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తానికి ఈ వర్షాల వల్ల సంతోషంతో పాటు కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తుంది..












