ఢిల్లీ నిరసనల్లో తనపై వచ్చిన దూషణలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆందోళనల్లో కొందరు యువతులు తనతో పాటు తన తల్లిని కూడా అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రధాని తెలిపారు. కాగా, మోదీ వీడియో విడుదల చేసిన కొద్ది గంటల్లోనే మోదీని తిట్టిన 15ఏళ్ల రుచికాసింగ్ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాగా ప్రధాని మోదీ ఆ వీడియోలో మాట్లాడుతూ.. ‘మన దేశంలో అమ్మాయిలు ఈ విధంగా మాట్లాడటం చాలామందికి కల్చరల్ షాక్‌లా అనిపించవచ్చు. అయితే, చిన్నతనంలో పొరపాట్లు చేయడం సహజమే.. వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది.. యువతను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం’ అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
https://x.com/narendramodi/status/2083245431769989598?s=20
ఈ వీడియో విడుదలైన కొన్ని గంటల్లో రుచికాసింగ్ క్షమాపణలు చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రుచికా సింగ్ క్షమాపణలు కోరుతూ ‘నా వయస్సు 15 ఏళ్లే.. స్నేహితులతో నిరసనలు జరుగుతున్న చోటుకు వెళ్లినప్పుడు అందరూ మోదీని తిట్టడం నేను చూశా. వాళ్ల ఇన్‌ఫ్లూయెన్స్‌లో పడి నేనూ నోరు జారాను. ఈ మాటలు క్షమించరానివి. కానీ ఇదే నా చివరి తప్పు, ఇకపై ఇలా చేయను. అందరూ నన్ను దయచేసి క్షమించండి. నా వైఖరికి నేనే సిగ్గుపడుతున్నా’ అంటూ పేర్కొంది.
https://x.com/choga_don/status/2083266744786001941?s=20
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశంపై కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. విద్యార్థులను శిక్షించడం కాకుండా సరైన మార్గం చూపించాలని ప్రధాని వ్యాఖ్యానించగా.. దీనిపై కాంగ్రెస్ మీడియా విభాగం హెడ్ పవన్ ఖేరా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ "దేశం మొత్తం ఆయనను క్షమాపణ కోరుతుంటే, ఆయనేమో దేశాన్ని క్షమించేశారు" అంటూ ఘాటుగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
https://x.com/Pawankhera/status/2083258740602806746?s=20












