నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్యల్లో పొట్టలో గ్యాస్ ఒకటి. భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం, తేన్పులు రావడం, కడుపులో భారంగా అనిపించడం, అపానవాయువులు రావడం వంటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తుంటాయి. సాధారణంగా జీర్ణక్రియ సమయంలో కొంత గ్యాస్ ఏర్పడటం సహజం. అయితే అది ఎక్కువగా మారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే మాత్రం కారణాలను గుర్తించడం అవసరం.
మెడ్‌లైన్ ప్లస్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వంటి ఆరోగ్య సంస్థల సమాచారం ప్రకారం, మన అలవాట్లే చాలా సందర్భాల్లో గ్యాస్ సమస్యకు కారణమవుతాయి. ముఖ్యంగా ఆహారాన్ని చాలా వేగంగా తినడం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా కడుపులోకి చేరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అలాగే తింటున్నప్పుడు ఎక్కువగా మాట్లాడటం, స్ట్రా ఉపయోగించి పానీయాలు తాగడం, చూయింగ్ గమ్ నమలడం, కార్బోనేటెడ్ కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లు కూడా గ్యాస్‌ను పెంచుతాయని తెలియచేస్తున్నారు.
అదేవిధంగా క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్, బీన్స్, ఉల్లిపాయలు వంటి కొన్ని కూరగాయలు, అలాగే యాపిల్, పియర్ వంటి పండ్లు కొందరిలో గ్యాస్‌ను పెంచే అవకాశం ఉంది. కొంతమందికి పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులు తీసుకున్న తర్వాత కూడా గ్యాస్, ఉబ్బరం వస్తుంటాయి. దీనికి లాక్టోజ్ కారణం కావచ్చు. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన ఆహారం సమస్య కలిగించదు. కాబట్టి మీకు ఏ ఆహారం తిన్నప్పుడు ఇబ్బంది ఎక్కువగా వస్తుందో గమనించడం చాలా ముఖ్యం.
అయితే గ్యాస్ సమస్యను తగ్గించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. మొదటిగా, ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా తినాలి. ఒకేసారి ఎక్కువగా తినకుండా చిన్న చిన్న మోతాదుల్లో భోజనం చేయడం మంచిది. రోజంతా తగినంత నీరు తాగాలి. భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కనీసం 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నడిస్తే జీర్ణక్రియకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా గ్యాస్ సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.
అయితే కొన్ని సందర్భాల్లో గ్యాస్ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. గ్యాస్‌తో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, నిరంతర ఉబ్బరం, వరుసగా విరేచనాలు లేదా మలబద్ధకం, కారణం లేకుండా బరువు తగ్గడం, వాంతులు, మలంలో రక్తం కనిపించడం లేదా మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే పదే పదే వచ్చే గ్యాస్ కేవలం అజీర్ణం మాత్రమే కాకుండా ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ (IBS), సీలియాక్ వ్యాధి, లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదా ఇతర జీర్ణకోశ సమస్యలకు సంకేతం కావచ్చని అంటున్నారు.
ఇక తరచుగా వచ్చే గ్యాస్ సమస్యకు స్వయంగా మందులు వాడటం కంటే, కారణాన్ని గుర్తించి జీవనశైలి, ఆహారపు అలవాట్లను సరిచేసుకోవడం ఉత్తమ పరిష్కారం. లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే తప్పకుండా గ్యాస్ట్రోఎంటరాలజిస్టును లేదా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












