Health

Health: వర్షాకాలంలో చెరకు రసం తాగడం.. ఆరోగ్యమా? అనారోగ్యమా?..

రచన: Venu5 నిమిషాల పఠనం

వర్షాకాలంలో చెరకు రసం తాగే విషయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చాలామందికి దాహం వేస్తుంది. అలాంటి సమయంలో రోడ్డు పక్కన దొరికే చల్లని చెరకు రసం తాగేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. నిజానికి చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఇది సహాయపడుతుంది.

అయితే వర్షాకాలంలో చెరకు రసం తాగే విషయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. రోడ్డు పక్కన పరిశుభ్రత లేకుండా తయారుచేసే చెరకు రసం ఈ సూక్ష్మజీవులతో కలుషితం కావచ్చు. ముఖ్యంగా ఈగలు వాలడం, శుభ్రం చేయని యంత్రాలు, అపరిశుభ్రమైన గ్లాసులు లేదా కలుషిత నీటితో తయారైన ఐస్ వాడటం వల్ల ఆహార సంబంధిత ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కలుషితమైన చెరకు రసం తాగితే విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి ఫుడ్‌బోర్న్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కలరా, టైఫాయిడ్ వంటి కొన్ని నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు కూడా కలుషిత ఆహారం లేదా నీటి వల్ల సంక్రమించవచ్చు. అయితే ఇవి కేవలం చెరకు రసం వల్లే వస్తాయని కాదు. పరిశుభ్రత లేకపోవడమే అసలు కారణమని వైద్యులు చెబుతున్నారు.

ఇక చాలాచోట్ల చెరకు రసంలో వేసే ఐస్ ఏ నీటితో తయారైందో తెలియదు. సురక్షితమైన తాగునీటితో తయారు చేయని ఐస్ వాడితే హానికరమైన సూక్ష్మజీవులు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంటుంది. అలాగే చెరకు రసం తీసే యంత్రాన్ని తరచూ శుభ్రం చేయకపోతే దానిపై పేరుకుపోయిన మురికి కూడా ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అయితే చెరకు రసాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. శుభ్రంగా ఉన్న చోట.. వీలైతే ఐస్ లేకుండా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు మధుమేహం ఉన్నవారు, చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే వైద్యుల సలహాతో తీసుకోవడం మంచిదని వైద్యులు తెలుపుచున్నారు. మొత్తానికి చెరకు రసం పోషకాలు కలిగిన సహజ పానీయమే. కానీ వర్షాకాలంలో దాని నాణ్యత, తయారీ విధానం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. రుచికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ పరిశుభ్రమైన చెరకు రసాన్ని మాత్రమే ఎంచుకుంటే, ఈ సీజన్‌లో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#health#drinking#sugarcane juice#monsoon#healthy#unhealthy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి