- 56 పేజీల సుదీర్ఘ తీర్పునిచ్చిన హైకోర్టు
- 62 కోర్టు ధిక్కరణ కేసుల మాఫీ?
- చట్ట పాలన కావాలి, వ్యక్తుల పాలన కాదని స్పష్టం
- తీర్పుపై అప్పీల్‌కు వెళితే ఎలా ఉంటుందనే ఆలోచన?
- కోర్టు ఆర్డర్ ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగుల నియమాకాల్లో జోక్యం అవుతుందా?
- న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చలు
- హైడ్రాను మరింత బలోపేతలం చేయడానికి కొత్త కమిషనర్‌గా ముగ్గురు అధికారుల పేర్లు?
- ఐపీఎస్‌పై హైకోర్టు బెంచ్ మార్క్ తీర్పు సారాంశంపై స్వేచ్ఛ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ చైర్మన్
9848070809
కోర్టు దిక్కరణ కేసులో ఐపీఎస్ స్థాయి అధికారిని బదిలీ చేయాలని ఇచ్చిన బెంచ్ మార్క్ తీర్పు సంచలనం రేపుతోంది. ప్రభుత్వ కార్యనిర్వహణలో కోర్టు జోక్యం చేసుకున్నట్లు ఈ తీర్పు అవుతుందా అని ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఏ ప్రభుత్వంలోనైనా వందల సంఖ్యలో కోర్టు ధిక్కరణ కేసులు ఉండడం కామన్. గతంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై 400 పైగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి , మేడ్చల్, హైదరాబాద్ కలెక్టర్స్‌పై నిత్యం కోర్టు ధిక్కరణ కేసులు పడుతూనే ఉంటాయి. ఇలాంటి కేసుల్లో హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 సెక్షన్ 12 ద్వారా 6 నెలల జైలు శిక్ష, 2 వేల జరిమానా విధించే అధికారం మాత్రమే ఉంటుంది. జైలుకు వెళ్లకుండా అప్పీల్‌కు వెళ్లడం లేదా క్షమాపణలు కోరడంతో ఈ శిక్షలు కొట్టుకుపోతాయి. కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి రిలీవ్ చేయాలని చెప్పడం, అందుకు కేసులు మాఫీ చేయడం, టాటా మోహన్ రావు కేసును ఉటంకించడంతోపాటు వ్యక్తులు, వ్యవస్థ, చట్టం అంటూ కొత్తవి ప్రస్తావించడంతో తీర్పు బలంగా ఉంది. కోర్టు ఒత్తిడితో క్షమాపణలు చెప్పడాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో సపరేషన్ ఆఫ్ పవర్ మసక బారుతుందా అనేది చర్చ జరుగుతోంది.
ఆర్టికల్ 311కి ప్రమాదం ఉందా?
అల్ ఇండియా సర్వీస్ అధికారులకు ఆర్టికల్ 311 ప్రత్యేక రక్షణ ఇస్తుంది. వారిని తొలగించే అధికారం కోర్టుకు ఉండదు. అది పూర్తిగా ప్రభుత్వంలోని ఎగ్జిక్యూటివ్‌కు చెందినది. కానీ ఇక్కడ రూట్ ఆఫ్ లా దెబ్బ తీస్తుందని కొంత మంది ఐఎఎస్‌లు అభిప్రాయపడుతున్నారు. అధికారిని రిలీవ్ చేయడం అంటే శిక్ష కాదని, ఆ ఒక్క అధికారి వ్యవహారంపైనే తీర్పు స్పష్టంగా ఉందని చెబుతున్నారు. ఆ స్థాయిలోనే మరో అధికారిని నియమించేందుకు వీలున్నందున సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది.
ముగ్గురు ఐజీ అధికారుల పేర్ల పరిశీలన
రంగనాథ్‌ను ఒకవేళ తొలగిస్తే ఆ స్థానంలో ఐపీఎస్ అవినాష్ మహంతి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు నడుచుకునే అధికారుల కోసం పరిశీలిస్తున్నారు. వర్షాకాలంలో హైడ్రా పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అవగాహన ఉన్న అధికారులను కూడా వెతుకుతున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకునేలా వ్యవహారించే వారు ఇంకా ఎవరెవరు ఉన్నారని ముగ్గురు పేర్లు లిస్టులో ఉన్నట్లు సమాచారం.












