సృష్టి ప్రారంభమైన రోజు... సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడి రోజు ఆదివారం.. వేదాలు, శాస్త్రాల ప్రకారం ఆది అంటే మొదలు. ఈ వారం కేవలం లౌకిక విశ్రాంతికి మాత్రమే పరిమితమైనది కాదు.. మన ఆత్మను శోధించుకోవడానికి, దైవిక శక్తితో అనుసంధానమవ్వడానికి ప్రకృతి ప్రసాదించిన పరమ పవిత్రమైన సమయం.. ఇక జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ఆత్మకారకుడు అంటారు. అంటే మన శరీరంలో ఉండే ఆత్మశక్తికి మూలం ఆదిత్యుడే..
అందుకే సూర్యనారాయణుడికి అంకితమైన పవిత్రమైన ఈ రోజును... వేదాలు, పురాణాలు, స్మృతులు.. శక్తి, ఆరోగ్యం, ఆత్మవికాసానికి ప్రతీకగా పేర్కొంటాయి... ఋగ్వేదంలో సూర్యుడిని జగత్తుకు ప్రాణశక్తిగా వర్ణించారు. మన శరీరానికి వెలుగు ఎలా అవసరమో... మనస్సుకు ధర్మబుద్ధి కూడా అంతే అవసరం. ఆ రెండింటినీ ప్రసాదించే శక్తి సూర్యునిదే అని పండితులు చెబుతారు..
ఇక ఆదివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి, సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడి అర్ఘ్యం సమర్పించడం అత్యంత శుభప్రదం. "ఓం ఘృణిః సూర్యాయ నమః" లేదా ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల మనస్సుకు స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆదివారంను కేవలం విశ్రాంతికి మాత్రమే కాకుండా... ఆత్మపరిశీలనకు కూడా కేటాయించాలని మహర్షులు ఉపదేశించారు.
వారంలో చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడం, తల్లిదండ్రులకు నమస్కరించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, పేదలకు అన్నదానం లేదా చిన్న సహాయం చేయడం ఈ రోజు విశేష ఫలితాలను ఇస్తుందని ధర్మశాస్త్రాలు సూచిస్తున్నాయి.. అలాగే కోపం, అసత్యం, ఇతరులను అవమానించడం, సమయాన్ని వృథా చేయడం వంటి అలవాట్లకు ఈ రోజు దూరంగా ఉండాలని కూడా ఆచారవేత్తలు చెబుతారు.
కుటుంబ సభ్యులతో కలిసి సూర్య ప్రార్థన చేయడం, మంచి గ్రంథాలు చదవడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం ద్వారా శరీరం, మనసు రెండూ ప్రశాంతంగా మారతాయి. అలాగే ఆదివారం అనేది కేవలం వారాంతం కాదు... కొత్త వారానికి ఆధ్యాత్మికంగా, మానసికంగా మనల్ని సిద్ధం చేసుకునే పవిత్ర అవకాశం. సూర్యుని కాంతి శరీరానికి ఎలా జీవం ఇస్తుందో... ధర్మమార్గంలో గడిపిన ఆదివారం మన జీవితానికీ అదే వెలుగును అందిస్తుందని పండితులు అంటున్నారు..
ఇక ఆదివారం నాడు మనం నేర్చుకోవాల్సిన గొప్ప జీవన సూత్రం.. ధర్మబద్ధమైన బాధ్యత, నిష్కామ సేవ... సండే అంటే కేవలం శరీరాన్ని సోమరితనంలో ముంచెత్తడం కాదు, మన ఆలోచనలను శుద్ధి చేసుకుని రాబోయే వారానికి నూతన ఆధ్యాత్మిక శక్తిని నింపుకోవడమనే విషయాన్ని పండితులు గుర్తు చేస్తున్నారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..












