International

Somali Pirates: సోమాలియా సముద్రపు దొంగల బందీలుగా 16 మంది భారత నావికులు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఆఫ్రికా తీర ప్రాంతాల్లో సముద్రపు దొంగలు (పైరేట్లు) మళ్లీ పంజా విసిరారు. ఏడెన్ గల్ఫ్‌తో పాటు సోమాలియా జలాల్లో పైరేట్లు జరిపిన వేర్వేరు దాడుల్లో మొత్తం 16 మంది భారతీయ నావికులు వారి చెరలో చిక్కుకున్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎంఏ) గురువారం అధికారికంగా స్పష్టం చేసింది.

ఆఫ్రికా తీర ప్రాంతాల్లో సముద్రపు దొంగలు (పైరేట్లు) మళ్లీ పంజా విసిరారు. ఏడెన్ గల్ఫ్‌తో పాటు సోమాలియా జలాల్లో పైరేట్లు జరిపిన వేర్వేరు దాడుల్లో మొత్తం 16 మంది భారతీయ నావికులు వారి చెరలో చిక్కుకున్నారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎంఏ) గురువారం అధికారికంగా స్పష్టం చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి జులై 17 మధ్య కాలంలో మూడు వాణిజ్య నౌకలను పైరేట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీటిలో చివరిగా జులై 17న ‘ఎంటీ అసానా’ నౌకను ఏడెన్ గల్ఫ్ ప్రాంతంలో హైజాక్ చేశారు. ఈ నౌకలో ఉన్న 22 మంది సిబ్బందిలో 11 మంది భారతీయులే కాగా, ప్రస్తుతం ఈ నౌకను సోమాలియా తీరం వైపు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు మే 2న ‘ఎంటీ యూరేకా’, ఏప్రిల్ 24న ‘ఎంటీ హానర్’ అనే నౌకలపై దాడులు చేసి అపహరించారు. ఈ రెండింటిలోనూ ఐదుగురు భారతీయ నావికులు బందీలుగా ఉన్నారు.

సిబ్బంది సమయస్ఫూర్తి.. తప్పిన మరో ప్రమాదం

మరోవైపు, నావికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఓ పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. జూలై 1న ‘ఎంవీ గోల్డెన్ ఆర్సెనల్’ నౌకపై సముద్రపు దొంగలు దాడికి యత్నించగా, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది షిప్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను అమలు చేసి, నౌకలోని భద్రతా గది అయిన ‘సిటాడెల్’లోకి వెళ్లిపోయారు. అక్కడి నుంచి వెంటనే ఇండియన్ నేవీకి సమాచారం చేరవేయడంతో, రంగంలోకి దిగిన భారత నౌకాదళం హెలికాప్టర్‌ను పంపించింది. సైనిక బలగాల రాకను గమనించిన పైరేట్లు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఏడెన్ గల్ఫ్ పరిసర ప్రాంతాలను ‘హై-రిస్క్ జోన్’గా ప్రకటించిన డీజీఎంఏ, నౌకా సంస్థలకు కీలక భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రయాణానికి ముందే భద్రతా ముప్పును అంచనా వేసుకోవాలని, ‘బెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్’ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే సిబ్బంది తక్షణమే సిటాడెల్‌లో ఆశ్రయం పొంది ఆర్మీ సాయం కోరాలని, నౌకా యజమానులు, కెప్టెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

#Indian Sailors Hijacked#Somalia Pirates Attack#Gulf of Aden Hijack#Indian Navy Maritime Security#DGMA Safety Advisory#Merchant Navy Sailors News#MT Asana Hijack#Somali Pirates Indian Sailors#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి