SIR: తెలంగాణలో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో SIR ప్రక్రియ గడువును మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఓటర్ల జాబితా సవరణకు తొలుత జూలై 24వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత దాన్ని ఆగస్టు 3కు పొడిగించారు. ఇప్పుడు మరో వారం గడువు పెంచుతూ ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు అవకాశం ఇచ్చింది ఈసీ.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 77.12 శాతం ఎన్యుమరేషన్ పూర్తైనట్లు ఈసీ తెలిపింది. హైదరాబాద్ లో 56.31 శాతం, రంగారెడ్డి జిల్లాలో 63.43 శాతం ఎన్యుమరేషన్ పూర్తైంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 61.37 శాతం ఎన్యుమరేషన్ పూర్తైంది. కీలక జిల్లాల్లో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దీంతో మరోసారి గడువును పెంచాల్సి వచ్చిందని తెలుస్తోంది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఓటర్లను నిర్ధారించడం, నకిలీ ఓట్లను గుర్తించడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం వంటివి చేస్తున్నారు. మరోవైపు ఏపీలో మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవడం, ఇవాళ ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగిపోయాయి.












