కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు ప్రత్యర్థులపై చివరి క్షణం వరకు పోరాడుతున్నారు. తమ పోరాట పటిమతో భారత సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. పరాజయం అంచుల దాకా వెళ్లినా గుండె ధైర్యంతో ప్రతీ మ్యాచ్‌లోనూ పోరాటపటిమను ప్రదర్శిస్తున్నారు. తాజాగా పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించగా, మరో యువ అథ్లెట్ యశ్‌వీర్ సింగ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
దీంతో ఒకే ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కడమే కాకుండా, పతకాల పట్టికలో దేశం మొత్తం 23 పతకాలతో (5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు) పదో స్థానానికి చేరుకుంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో నీరజ్ చోప్రా తన రెండో ప్రయత్నంలో 85.83 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అయితే, శ్రీలంకకు చెందిన ఆర్.టి. పతిరగే ఊహించని రీతిలో 89.75 మీటర్ల దూరం విసిరి సంచలన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌కు కామన్వెల్త్ చరిత్రలో ఇది రెండో పతకం కావడం విశేషం.
ఈ మ్యాచ్‌లో భారత యువ అథ్లెట్ యశ్‌వీర్ సింగ్ అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. చివరి (ఆరో) ప్రయత్నం వరకు పతక రేసులో లేని అతడు, ఒక్కసారిగా 85.41 మీటర్ల దూరం విసిరి వ్యక్తిగత ఉత్తమ రికార్డుతో మూడో స్థానానికి దూసుకొచ్చి కాంస్యం ఖాయం చేసుకున్నాడు. మరో భారత పోటీదారు రోహిత్ యాదవ్ 81.56 మీటర్లతో ఏడో స్థానంతో ముగించాడు. అనంతరం తీవ్ర నిరాశ పరిచింది మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్, పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్.
పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నదీమ్ కేవలం 77.41 మీటర్ల దూరం మాత్రమే విసిరి తొమ్మిదో స్థానానికే పరిమితమయ్యాడు. శ్రీలంక అథ్లెట్ పతిరగే బంగారు పతకం గెలవడం ఈ పోటీలోనే అతిపెద్ద అనూహ్య పరిణామంగా నిలిచింది. ఇప్పటివరకు భారత అథ్లెట్లు మొత్తం 23 పతకాలు సాధించారు. అందులో ఐదు స్వర్ణాలు ఉన్నాయి. అదేవిధంగా 12 రజతాలు, ఆరు కాంస్యాలు ఉన్నాయి. ఈ పతకాల సాధనతో భారత్ ప్రస్తుతం పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది.












