ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక విప్లవాత్మకమైన సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో ఏపీ త్వరలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ శంఖారావంలో పాల్గొన్న పవన్.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమపై, ఆయన దూరదృష్టిపై ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిరోజూ నెరవేరుస్తూ, భారత్‌ను 'వికసిత్ భారత్' వైపు అత్యంత వేగంగా నడిపిస్తున్నారని పవన్ కొనియాడారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా దేశ ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకునే అరుదైన నాయకుడు మోదీ అని చెప్పారు. ఆయన బలమైన నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త ఎత్తులకు ఎదుగుతోందని, ప్రతి రంగంలోనూ ప్రగతి పథంలో దూసుకుపోతోందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీగారు గతంలో ఎదుర్కొన్న తీవ్ర విమర్శలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు నాయకులు ప్రధానిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శిస్తున్నప్పుడు తాను వ్యక్తిగతంగా చాలా బాధపడ్డానని పవన్ తెలిపారు. ఎదురుదెబ్బలు తగిలినా, తీవ్ర అవమానాలు ఎదురైనా, కాళ్లను వెనక్కి లాగే కుట్రలు జరిగినా ప్రధాని మోదీ ఏనాడూ భయపడలేదని, చెక్కుచెదరని సంకల్పంతో ముందుకు సాగారని కొనియాడారు.
తనను కఠినంగా దూషించిన వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించే అత్యంత గొప్ప గుణం, విశాల హృదయం ప్రధాని మోదీ సొంతమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అలాంటి మహోన్నత నాయకుడు భారత ప్రధానిగా లభించడం మనందరి అదృష్టమని అభివర్ణించారు. చంద్రబాబు విజన్, ప్రధాని మోదీ అందిస్తున్న నిరంతర ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న భోగాపురం ప్రాజెక్టు.. ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక రంగానికి మహర్దశ తీసుకవస్తుందని స్పష్టం చేశారు.












