పేదల ఆశలు ఎప్పుడు అందనంత ఎత్తులోనే ఉంటాయి. అందుకే మోసాగాళ్లు ఇలాంటి వారిని టార్గెట్ చేసి నమ్మించి నట్టేట ముంచుతారు. ఇలా ఇప్పటి వరకు వివిధ మార్గాలలో మోసం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి పేదలను టార్గెట్ చేసిన భారీ మోసాన్ని పోలీసులు బయటపెట్టారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో అమాయకుల ఆశలను ఆసరాగా చేసుకుని లక్షల రూపాయలు దోచుకున్న ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది. జూబ్లీహిల్స్ టాస్క్ ఫోర్స్, మొఘల్‌పురా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ప్రధాన నిందితుడు సయ్యద్ సల్మాన్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి.
ప్రభుత్వంలోని ఉన్నతాధికారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మించిన నిందితుడు.. త్వరగా 2BHK ఇల్లు కేటాయింపులు చేయిస్తాను అంటూ బాధితులను వలలోకి దింపేవాడు. ఇందుకోసం వారి ఆధార్ కార్డు జిరాక్స్‌లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించేవాడు. తర్వాత అసలు మోసం మొదలయ్యేది. ప్రభుత్వ అధికారిక పత్రాల మాదిరిగానే కనిపించే నకిలీ కేటాయింపు ఉత్తర్వులను తయారు చేసి, వాటిపై నకిలీ ముద్రలు, సంతకాలు ఉపయోగించి అసలైన డాక్యుమెంట్లలా చూపించేవాడు.
ఇలా ఏకంగా 52 నకిలీ కేటాయింపు పత్రాలను సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ పత్రాలను చూపించి 50 మందికి పైగా బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. కొందరు జీవితాంతం కూడబెట్టిన పొదుపు డబ్బును, మరికొందరు అప్పులు చేసి ఇచ్చిన సొమ్మును ఈ మోసగాడు కాజేసినట్లు తెలుస్తోంది. నిందితుడి వద్ద నుంచి నకిలీ కేటాయింపు పత్రాలు, ఒక మొబైల్ ఫోన్‌తో పాటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఈ మోసంలో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా? ఇంకెంతమంది బాధితులు ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రజలకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా, ప్రత్యేక పరిచయాలతో ఇళ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చినా నమ్మవద్దని సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులు పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతాయని, ఎలాంటి మధ్యవర్తులు లేదా దళారులను ఆశ్రయించవద్దని తెలిపారు.
ప్రజలు ఎప్పుడూ అధికారిక ప్రభుత్వ ప్రకటనలు, సంబంధిత శాఖల ద్వారా వచ్చే సమాచారాన్నే నమ్మాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఒక్క క్షణం అప్రమత్తంగా ఉంటే... ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండవచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు.












