Vatpalli Police Station: సంగారెడ్డి వట్ పల్లి పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. దరఖాస్తుపల్లి గ్రామస్తులు పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. పీఎస్ లోని అద్దాలు, ఫర్నీచర్ ను గ్రామస్తులు ధ్వంసం చేశారు. బీరప్ప (22) అనే వ్యక్తి చెట్టుకి ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే, కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని వట్ పల్లి పోలీసులు కిందకు దించారు. చెట్టు పైనుంచి మృతదేహాన్ని ఎలా కిందకు దించుతారని మృతుడి కుటుంబీకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతుడి కుటుంబసభ్యులు గ్రామస్తులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా కిందకు దించారని పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు పీఎస్ పై దాడి చేశారు. మృతుడు బీరప్ప వట్ పల్లిలోని ఓ దాబాలో పని చేస్తున్నాడు. అనుమానాస్పద స్థితిలో అతడు మరణించాడు. వట్ పల్లి పోలీసులు దాబా యజమానితో కుమ్మక్కయారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. వట్ పల్లి పోలీస్ స్టేషన్ పై గ్రామస్తుల దాడితో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












