ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల సంక్షోభం
భారీగా మిగిలిపోయిన సీట్లు
ఒకటి కొంటే మరొకొటి ఉచితమంటూ ఆఫర్లు
తెలంగాణలో 23 వేల సీట్లు ఖాళీ
ఇంజినీరింగ్ విద్యలో ఏం జరుగుతోంది..?
ఒకప్పుడు ఇంజినీరింగ్ సీట్ల కోసం కాలేజీల చుట్టూ విద్యార్థులు తిరిగేవారు. ఇప్పుడు విద్యార్థుల కోసం కాలేజీలు తిరుగుతున్నాయి. ఎంతలో ఎంత మార్పు..? కంప్యూటర్ సైన్స్ (CSE) సీటు దక్కాలంటే మంచి ర్యాంక్‌తో పాటు భారీ డిమాండ్ ఉండేది. పేరున్న కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా తల్లిదండ్రులు వెనుకాడేవారు కాదు. కానీ ఇప్పుడు అదే ఇంజినీరింగ్ విద్య పూర్తిగా భిన్నమైన దశలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోవడం, కాలేజీలు విద్యార్థుల కోసం కన్సల్టెంట్లను ఆశ్రయించడం, సీట్లు అమ్మిపెట్టేందుకు భారీ కమీషన్లు ప్రకటించడం విద్యారంగంలో పెద్ద చర్చకు దారితీసింది.
23 వేల సీట్లకు ఇంకా విద్యార్థులు దొరకలేదు..!
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 94,424 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కూడా 71,452 మంది మాత్రమే కాలేజీల్లో రిపోర్ట్ చేశారు. అంటే 22,972 సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
ఇది కన్వీనర్ కోటా పరిస్థితి మాత్రమే. మేనేజ్‌మెంట్ కోటా (బీ కేటగిరీ)లో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... గతంలో అత్యధిక డిమాండ్ ఉన్న CSE, CSE స్పెషలైజేషన్ బ్రాంచ్‌లలో కూడా సీట్లు పూర్తిగా భర్తీ కాలేదని విద్యారంగ వర్గాలు చెబుతున్నాయి.
కన్సల్టెంట్లకు రెడ్ కార్పెట్..!
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు గతంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం పేరున్న కాలేజీల యాజమాన్యాలు కన్సల్టెంట్లను తమ కాలేజీ గేటు దగ్గరకు కూడా రానిచ్చేవి కావు. మా కాలేజీకి విద్యార్థులు వాళ్లంతట వాళ్లే వస్తారు అనే ధీమాతో ఉండేవి.
కానీ ఇప్పుడు అదే కాలేజీలు కన్సల్టెంట్లకు స్వాగతం పలుకుతున్నాయి. విద్యార్థులను తీసుకురండి... మంచి కమీషన్ ఇస్తాం... అంటూ బతిమాలుకునే పరిస్థితి ఏర్పడిందట. కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక్కో కన్సల్టెంట్‌కు 10 నుంచి 20 మేనేజ్‌మెంట్ సీట్ల బాధ్యతలు అప్పగించి, అవి పూర్తిగా అమ్మిపెట్టాలని ప్రత్యేకంగా కోరుతున్నట్లు తెలుస్తోంది.
బై వన్... గెట్ వన్ ఆఫర్లు కూడా..!
బై వన్ గెట్ వన్ అంటే ఏ బట్టల దుకాణంలోనో, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లోనో అనుకునేరు. ఇప్పుడు ఈ ఆఫర్లు ఇంజినీరింగ్ కాలేజీల నుంచి వినిపిస్తున్నాయి. సీట్లు భర్తీ చేసుకునేందుకు కొన్ని కాలేజీలు అనుసరిస్తున్న విధానాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కండ్లకోయ, మైసమ్మగూడ ప్రాంతాల్లోని కొన్ని కాలేజీలు "ఐదు సీట్లు తీసుకొస్తే... మరో రెండు సీట్లు ఉచితం" అనే తరహా ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు సమాచారం.
ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లోని కొన్ని కాలేజీలు "బై వన్... గెట్ వన్" తరహా స్కీమ్స్‌తో కన్సల్టెంట్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని విద్యారంగంలో చర్చ జరుగుతోంది. నిజాంపేట్, బాచుపల్లి, ఘట్‌కేసర్, గండిపేట్, మొయినాబాద్, షేక్‌పేట్, వట్టినాగులపల్లి ప్రాంతాల్లోని అనేక కాలేజీలు కూడా మిగిలిపోయిన బీ కేటగిరీ సీట్లను ఎలాగైనా భర్తీ చేయాలనే లక్ష్యంతో భారీ కమిషన్లు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంత పెద్ద సంక్షోభానికి కారణాలేంటి..?
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలు, సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. కానీ అంతమంది విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు రావడం లేదు. ఉద్యోగాల మార్కెట్‌లో మార్పులు రావడం విద్యార్థుల ఆలోచనలను మార్చేసింది. కేవలం ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే ఉద్యోగం వస్తుందనే నమ్మకం తగ్గుతోంది. మంచి నైపుణ్యాలు, ప్రత్యేక స్కిల్స్ ఉన్నవారికే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయనే అభిప్రాయం విద్యార్థుల్లో పెరిగింది.
AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మీడియా, డిజైన్, ప్యారామెడికల్, మేనేజ్‌మెంట్ వంటి ప్రత్యామ్నాయ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది. విదేశీ విద్యపై ఆకర్షణ కూడా పెరుగుతోంది. కొంతమంది విద్యార్థులు దేశంలో ఇంజినీరింగ్ చేయడం కంటే నేరుగా విదేశాల్లో ఉన్నత విద్యపై దృష్టి పెడుతున్నారు.
ఇంజినీరింగ్ విద్యకు అసలు భవిష్యతే లేదా..?
ఇంజినీరింగ్ విద్యకు అద్భుతమైన భవిష్యత్ ఉంది. ప్రపంచం మొత్తం టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, స్పేస్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సెంటర్లు... ఇవన్నీ ఇంజినీర్లపైనే ఆధారపడి ఉన్నాయి.
భారత్ కూడా తయారీ రంగాన్ని విస్తరించేందుకు, ఎలక్ట్రానిక్స్, చిప్ తయారీ, డిఫెన్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ రంగాలకు కూడా నైపుణ్యం ఉన్న ఇంజినీర్లు అవసరమే. ఐతే ఒకప్పుడు ఏదో ఒక ఇంజినీరింగ్ కాలేజీలో చేరితే చాలు అనుకునేవారు.
ఇప్పుడు మాత్రం ఏ కాలేజీ? అక్కడ ప్లేస్‌మెంట్లు ఎలా ఉన్నాయి? ఇండస్ట్రీ కనెక్షన్లు ఉన్నాయా? సగటు ప్యాకేజీ ఎంత? అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కొని మరీ చేరుతున్నారు విద్యార్థులు. అందుకే మంచి రికార్డు ఉన్న ప్రముఖ సంస్థల్లో ఇప్పటికీ పోటీ కనిపిస్తుండగా, ప్లేస్‌మెంట్లు బలహీనంగా ఉన్న అనేక కాలేజీలు సీట్లు భర్తీ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయి.
రాబోయే రోజుల్లో కూడా ఇంజినీర్లకు డిమాండ్ ఉంటుంది. అయితే మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, పరిశ్రమలతో అనుసంధానం, నాణ్యమైన బోధన అందించలేని కాలేజీలు నిలబడటం కష్టమవుతుంది.












