Cm Revanth - Hydraa: హైడ్రా పని తీరుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పరిధిలోని చెరువులకు హైడ్రా జీవం పోస్తోందని సీఎం రేవంత్ అన్నారు. ఉప్పల్ నల్ల చెరువు జలకళను సంతరించుకున్నట్లు హైడ్రా షేర్ చేసిన వీడియోను సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. నల్ల చెరువు పునరుజ్జీవానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్. చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న మన హైదరాబాద్ ను చూడటం నాకెంతో సంతృప్తిని ఇచ్చిందన్నారాయన.
హైదరాబాద్ CURE పరిధిని క్యూర్ చేసుకుంటూ, మన చెరువులకు జీవం పోస్తూ, భావి తరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును అంకితం చేస్తోంది HYDRAA అని ప్రశంసలు కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదు.. భావి తరాల భవిష్యత్తును భద్రపరచడం కూడా అని స్పష్టం చేశారు. ప్రతి చెరువును కాపాడుతూ... ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామని ప్రకటించారు.
హైడ్రా వ్యవహారం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లోతుకుంటలోని శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ భూముల అంశంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయనను హైడ్రా కమిషనర్ గా తొలగించి, ఆ స్థానంలో మరొక అధికారిని నియమించాలని కోర్టు ఆదేశాలు సైతం ఇచ్చింది. ఈ క్రమంలో మరోసారి హైడ్రా అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంలో హైడ్రా పనితీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ చెరువులకు హైడ్రా జీవం పోస్తోందని రేవంత్ చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












