హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు రయ్ రయ్
అందుబాటులోకి ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే
తెలంగాణ అభివృద్ధిలో ఇదో గేమ్ చేంజర్
హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు షార్ట్‌కట్ రూట్ ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే. విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ రోడ్డును ప్రారంభించారు. దీంతో తెలంగాణ-ఏపీ మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగవ్వనున్నాయి. ఇప్పటి వరకు విజయవాడ లేదా హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిన అనేక ప్రాంతాలకు ఇక ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది.
ఖమ్మం నుంచి ఆంధ్ర తీర ప్రాంతాలకు వేగవంతమైన కనెక్టివిటీ
ప్రస్తుతం ఖమ్మం నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు వెళ్లాలంటే సమయం ఎక్కువ పడుతోంది. విజయవాడ నుంచి వెళ్లడమొక్కటే ఆప్షన్. కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే పూర్తయితే ఈ దూరం, ప్రయాణ సమయం రెండూ గణనీయంగా తగ్గనున్నాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే వారికి ఏకంగా 2-3 గంటల సమయం ఆదా కానుంది. అంతేకాదు 50-60 కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది. రాజమండ్రి, కాకినాడ తదితర నగరాలకు వెళ్లే వాళ్లకు కూడా ఎంతో టైమ్ సేవ్ అవుతుంది.
అంతేకాదు.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు సరుకుల రవాణా మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, పరిశ్రమల సరుకులు తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుతాయి.
పెట్టుబడులకు కొత్త అవకాశాలు
పెద్ద పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేటప్పుడు ముందుగా చూసేది రవాణా సౌకర్యాలనే. హైవేలు, రైల్వేలు, పోర్టులకు కనెక్టివిటీ ఉంటేనే పరిశ్రమలు ఆసక్తి చూపుతాయి. ఖమ్మం-దేవరపల్లి హైవేతో తెలంగాణలోని తూర్పు ప్రాంతాలకు పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రో ఇండస్ట్రీస్, కోల్డ్ స్టోరేజ్ రంగాలకు ఇది ఉపయోగపడవచ్చు.
ఖమ్మం జిల్లా అభివృద్ధికి బలమైన ఊతం
కొత్త జాతీయ రహదారి ఏర్పడితే సాధారణంగా రోడ్డుకు ఇరువైపులా అభివృద్ధి వేగంగా జరుగుతుంది. పారిశ్రామిక యూనిట్లు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ పార్కులు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, వాణిజ్య కేంద్రాలు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. ఖమ్మం ఇప్పటికే వ్యవసాయం, మిర్చి, పత్తి, ధాన్యం ఉత్పత్తిలో కీలక జిల్లాగా ఉంది. ఇప్పుడు మెరుగైన రవాణా సదుపాయం రావడంతో రైతులకు కూడా మార్కెట్లకు త్వరగా చేరుకునే అవకాశం లభిస్తుంది.
పర్యాటక రంగానికీ ఊతం
భద్రాచలం, పాపికొండలు, గోదావరి ప్రాంతాలతో అనుసంధానం మెరుగుపడితే పర్యాటక రంగానికి కూడా కొత్త అవకాశాలు ఏర్పడతాయి. తెలంగాణ నుంచి గోదావరి ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.












