Arvind Kejriwal: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన E20 పెట్రోల్ పాలనీ క్రమ క్రమంగా రాజకీయ వేడి పెంచుతోంది. E20 ఇంధన విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పోరుబాట పట్టారు. పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు సాధారణ పెట్రోల్ లేద 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆగస్టు 4న ప్రధాని నివాసానికి పాదయాత్ర చేపట్టనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. పాదయాత్రగా వెళ్లి కేంద్ర విధానానికి వ్యతిరేకంగా ప్రజా వినతిపత్రాలను సమర్పిస్తామన్నారు.
ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో E20 ఇంధన విధానంపై టౌన్ హాల్ సమావేశం జరిగింది. ఇందులో కేజ్రీవాల్ పాల్గొన్నారు. E20 ఇంధన విధానంపై పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరిస్తామన్నారు. సుమారు 100 మందితో కలిసి లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్రగా వెళ్లి వినతిపత్రాలను అందజేస్తామన్నారు.
E20 ఇంధనం వాడకం వల్ల వాహనాలకు ఎటువంటి హాని జరగదని కేంద్రం చెబుతోందని, అందుకు సంబంధించి అధ్యయన నివేదికను బహిర్గతం చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోల్, E20 పెట్రోల్ లలో ఒకదాన్ని ఎంపిక చేసుకునే వెసులుబాటును వాహనదారులకు కల్పించాలని కేంద్రం ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. అలాగే E20 మిశ్రమ పెట్రోల్ ధరలతో పాటు సాధారణ పెట్రోల్ ధరలను కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇథనాల్ వాడకం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుందన్నారు కేజ్రీవాల్. భూమి, నీరు కలుషితం అవుతాయని.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాల కోసమే కేంద్రం ప్రజలపై బలవంతంగా E20 ఇంధనాన్ని రుద్దుతోందని ఆయన ఆరోపించారు.
E20 లేకపోతే పెటోల్ లీటర్ ధర రూ.125కి చేరేది-కేంద్రం
కాగా, ఈ 20 పెట్రోల్ పాలసీని కేంద్రం మరోసారి సమర్థించుకుంది. ఇరాన్-అమెరికా యుద్ధం సమయంలో ఇథనాల్ వల్లే రేట్లు భారీగా పెరగకుండా నియంత్రించగలిగామని వెల్లడించింది. యుద్ధం కారణం సరఫరా గొలుసు దెబ్బతిని క్రూడాయిల్ బ్యారెల్ ధర 135 డాలర్లకి చేరిందని, ఒక వేళ ఇథనాల్ లేకపోతే లీటర్ పెట్రోల్ ధర 125 రూపాయలకు పెరిగేదని వివరించింది. 20శాతం ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఢిల్లీలో లీటర్ రేటు 94 రూపాయలకే పరిమితమైందని, దాదాపు 30 రూపాయలు ఆదా అయిందని కేంద్రం వెల్లడించింది.












