TG:తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును పొడిగిస్తూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ముందుగా సెప్టెంబర్ 16తో ముగియాల్సిన గడువును ఇప్పుడు అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, వివరాల్లో మార్పులు లేదా ఇతర అంశాలపై అభ్యంతరాలు ఉంటే ఈ గడువులోగా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ప్రజలకు మరింత సమయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
అక్టోబర్ 7 వరకు అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను అధికారులు పరిశీలించనున్నారు. అప్లికేషన్ వెరిఫికేషన్‌తో పాటు అవసరమైన సవరణలు, పరిష్కార ప్రక్రియను నవంబర్ 5లోగా పూర్తి చేయాలని ECI నిర్ణయించింది. ఈ దశలో ఓటర్ల వివరాలను పరిశీలించి అర్హతకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం పూర్తైన అనంతరం తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9న ప్రచురించనున్నారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న SIR ప్రక్రియకు తుది రూపు రానుంది.
ఈ నేపథ్యంలో అర్హత కలిగిన ఓటర్లు గడువు ముగిసేలోపు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని, అవసరమైన మార్పులు లేదా అభ్యంతరాలను నిర్ణీత సమయంలోగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. గడువు పొడిగింపును అర్హులైన ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.












