తెలంగాణలోని ఆటో డ్రైవర్లు, కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి తెలిపారు. ఆటో సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన కీలక సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
టీజీఎస్ ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రవేశపెడుతున్నారనే ప్రచారంలో నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే, ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చి, కేబినెట్ ఆమోదంతో అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు.
2012 తర్వాత ఆటో ఛార్జీలు పెంచలేదని గుర్తుచేసిన మంత్రి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈమేరకు అధికారులు, సంఘాల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రత్యేక యాప్ తెచ్చేందుకు ఐటీ శాఖతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు..
పర్మిట్ కోటా విడుదల, అగ్రిగేటర్ పాలసీల అధ్యయనానికి ప్రత్యేక కమిటీని నియమించినట్టు వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్‌లో ఇతర జిల్లాల ఆటోల చట్టవిరుద్ధ రాకపోకలపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. సారథి పోర్టల్‌లో లైసెన్స్ స్పష్టత కోసం కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.
నగరంలో పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు 18,766 డీజిల్, పెట్రోల్ ఆటోలను రెట్రోఫిట్మెంట్ చేసుకునేందుకు, ఒక్కో ఆటోకు రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేలా రూ.200 కోట్ల నిధులు కేటాయించామని, డ్రైవర్ల కోసం ప్రమాద, సహజ మరణ బీమా కల్పించేలా ఇందిరమ్మ పాలసీని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని మంత్రులు తెలిపారు..












